తెలుగుదేశంపార్టీకి ప్రభుత్వం భారీ షాక్ తప్పదా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. అప్పుడెప్పుడో ఫ్యాక్టరీ విస్తరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత బాగాన్ని తిరిగి వెనక్కు తీసేసుకోవాలని తాజాగా నిర్ణయించిందట. దాంతో  ఎంపి చేతిలో ఉన్న భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోబోతోందంటూ పచ్చమీడియా ప్రముఖంగా అచ్చేసింది. ఇదే నిజమైతే గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ కు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లే.

 

ఇంతకీ విషయం ఏమిటంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో చిత్తూరుకు దగ్గరలో గల్లా జయదేవ్ కంపెనీ అమరరాజా కంపెనీకి  483 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అంటే కేటాయింపు మొత్తం ఏపిఐఐసి ద్వారానే జరిగింది లేండి. రైతుల నుండి భూములు సేకరించింనందుకు అయ్యే మొత్తం ఖర్చును కూడా కంపెనీయే చెల్లించింది. అలాగే ఏపిఐఐసికి కూడా ఫీజుల రూపంలో కంపెనీ భారీ మొత్తాలే చెల్లించింది. గ్రోత్ క్యారిడార్ పేరుతో కంపెనీయే వ్యవహారాలను అన్నీ నడుపుతోంది.

 

అంటే రెండు రకాలుగా ఇటు రైతులకు అటు ఏపిఐఐసికి కూడా  కంపెనీ డబ్బులు చెల్లించిందని అర్ధమవుతోంది. ఆ తర్వాత కంపెనీ విస్తరణ కూడా జరిగింది. మోటారు వాహనాలు, టూ వీలర్లకు అవసరమైన బ్యాటరీలను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ విస్తరణ పేరుతో యాజమాన్యం కోట్ల రూపాయలను ఖర్చులు చేసింది. సరే అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. అదేమిటంటే తాజాగా కంపెనీకి ఇవ్వగా మిగిలిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు పచ్చమీడియా చెప్పింది.

 

కంపెనీ తీసుకున్న 483 ఎకరాల భూమిలో సగం అంటే సుమారుగా  244 ఎకరాలు ఖాళీగానే ఉన్నట్లు ఏపిఐఐసి గుర్తించినట్లు సమాచారం. కంపెనీకి ఇచ్చిన భూమిలో సగం ఖాళీగా ఉంది కాబట్టి వాపసు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏపిఐఐసి ద్వారా ప్రతిపాదనలను తెప్పించుకుందట. అంటే వచ్చే మంత్రివర్గంలో పెట్టి చర్చించి వాపసు తీసుకోవటం ఖాయంగా మీడియా చెప్పింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం దగ్గర నుండి కంపెనీ ఉచితంగా ఏమీ తీసుకోలేదు. మొత్తం డబ్బులు కట్టే తీసుకుంది. పైగా రైతులకు చెల్లించాల్సిన డబ్బులు కూడా కంపెనీయే చెల్లించింది. మరి ప్రభుత్వం చేస్తున్న పని సరైనదేనా ? అసలు పచ్చమీడియాలో వచ్చింది నిజమేనా ? వచ్చే క్యాబినెట్ సమావేశం వరకూ వెయిట్ చేయాల్సిందే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: