కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది. గత కొన్ని రోజులుగా మీడియాలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి వార్తలు వస్తున్నాయి. ధాన్యం సేకరణ, చెల్లింపుల విషయంలో కేంద్రం నుండి నిధులు విడుదల కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దృష్టికి ఈ విషయం వెళ్లడంతో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు విడుదలయ్యాయి. 
 
వెంకయ్య నాయుడు సంబంధిత కేంద్ర మంత్రులతో ఏపీకి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. రైతులకు పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి ఆహార పౌర సరఫరా అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే కేంద్రం ఏపీకి రావాల్సిన 2498 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కేంద్రం ఏపీ పౌర సరఫరాల శాఖకు ఈ నిధులను బదిలీ చేసింది. 
 
కేంద్రం నిధులు విడుదల చేయడం ఏపీ ప్రభుత్వానికి, ఏపీ రైతులకు శుభవార్త అనే చెప్పాలి. ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ నిధుల విడుదల గురించి వెంకయ్యనాయుడుకు సమాచారం ఇవ్వగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి వెంకయ్య చొరవతో ఏపీ రైతులకు నిధులు విడుదలయ్యాయి. రెండు రోజుల క్రితం ఏపీ మంత్రులు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో సహకరించాలని వెంకయ్యను కోరారు. 
 
వైసీపీ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు బుధవారం వెంకయ్యకు లేఖ రాశారు. లేఖలో మంత్రులు వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు, ఇతర విషయాలను ప్రస్తావించారు. ఏపీకి విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులు, సంస్థల విషయంలో ప్రత్యేక చొరవ చూపి రాష్ట్రానికి మంచి చేయాలని కోరారు. వైసీపీ మంత్రుల విజ్ఞప్తి మేరకు వెంకయ్య వెంటనే స్పందించి నిధుల విడుదలకు సహకరించారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: