తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్ దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు దిశ చట్టానికి రూపకల్పన చేయడంపై పొగడ్తలతో ముంచెత్తారు. ఈరోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజాసింగ్ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మంచి పనుల్ని మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో మంచి పథకాలను అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మంచిగా చెప్పిస్తారంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో దిశ ఘటన తరువాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాజాసింగ్ ప్రభుత్వానికి సూచించారు. 
 
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం దిశ అత్యాచార ఘటన తరువాత దిశ పేరుతో మంచి మంచి చట్టాలను, పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు కాపీ చేయడం లేదని ప్రశ్నించారు. అంతకుముందే డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై రాజా సింగ్ విమర్శలు చేశారు. 
 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పటంతో నిధులు విడుదల చేసిందని అన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎక్కడ నిర్మిస్తున్నారో... ఎంతమందికి ఇళ్లను ఇస్తున్నారో వివరాలు చెప్పాలని అన్నారు. ప్రభుత్వంపై డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రానికి తెలపాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేకపోవడం చాలా మంచి విషయమని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇకముందు కూడా రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం ఇదే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో పూజారుల వేతనాలు పెంచాలని రాజా సింగ్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: