తెలుగు దేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. ఓవైపు ఎన్నికలు వాయిదా కోసం ప్రయత్నాలు చేస్తూనే... మరోవైపు ఎన్నికలకు నేతలను, క్యాడర్‌ను సమాయాత్తం చేస్తోంది. ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ... మరోవైపు కమిటీలతో ఎన్నికల సెల్ ను ఏర్పాటు చేసింది.

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఐదుగురు నేలతో హైలెవల్ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, లోకేష్, వర్ల రామయ్య ఈ కమిటీలో ఉంటారు. ఎన్నికల ప్రక్రియను వీరు సమన్వయం చేస్తారు. జిల్లా నేతలతో సంప్రదింపులు, వ్యూహాలపై ఈ కమిటీ పని చేయనుంది. 

 

ఇది కాకుండా రాష్ట్ర స్థాయిలో మరో కమిటీని కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. వీరంతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో అందుబాటులో ఉంటారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కేడర్‌ను పర్యవేక్షించడంతోపాటు తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. కమిటీల సభ్యులతో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అయి కార్యారణపై చర్చించారు.

 

 ఓవైపు ఎన్నికలకు సమాయత్తం అవుతూ... మరోవైపు వాయిదా కోసం ప్రయత్నాలు చేస్తుంది టీడీపీ. ఇప్పటికే సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల అంశంపై టిడిపి నేతలు పిటిషన్ వేశారు. అయితే దానిపై కోర్టు విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు పార్టీ బిసి నేతలు సీఎంకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వెయ్యాలని కోరారు. కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతోంది టీడీపీ. 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళితే బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీ నేతలు చెపుతున్నారు.

 

మరోవైపు ఎన్నికల సంఘం మీటింగ్ లో పాల్గొన్న టీడీపీ నేతలు పలు అంశాలపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కొత్త చట్టం పేరుతో పోలీసు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను, గ్రామ సచివాలయ ఉద్యోగుల సేవలను ఉపయోగించవద్దని టీడీపీ డిమాండ్ చేసింది. పార్టీ నేతలతో మీటింగ్ అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే శనివారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆయన హైదరాబాద్ టూర్ రద్దు చేసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: