కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును ప్రభుత్వం మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి ఆయన స్థానంలో అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద్ గజపతిరాజు కూతురు సంచయిత గజపతిరాజునును నియమించింది. ఈ నియామకంపై ఈరోజు మీడియా ఎదుట అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వైసీపీ ప్రభుత్వం తీరు వింతగా ఉందని... వేరే మతం వారిని ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తే సమస్యలు వస్తాయని అన్నారు. వైసీపీ దేవాదాయ భూములపై కన్నేసిందని... ఆలయాలకే దాతల భూములు చెందేలా చేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా సంచయిత గజపతిరాజు స్పందించారు. తన బాబాయ్ తాను హిందువు కాదన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తారని అస్సలు ఊహించలేదని అన్నారు. వాటికన్ సిటీకి వెళ్లి ఫోటో దిగినంత మాత్రాన తాను హిందువు కాకుండా పోతానా...? అని ప్రశ్నించారు. 
 
మీరు ఎప్పుడూ చర్చిలకు, మసీదులకు, గురుద్వారాలకు వెళ్లలేదా..? అని అశోక్ గజపతిరాజును ప్రశ్నించారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్లినంత మాత్రాన మీరు హిందువు కాకుండా పోయారా..? అని ప్రశ్నించారు. తాను పెద్దల పట్ల గౌరవంతో సైలెంట్ గా ఉన్నానని, కుటుంబంలోని వివాదాల గురించి తానెప్పుడూ బయటకు చెప్పలేదని అన్నారు. ప్రభుత్వం వారసుల వంతులో భాగంగానే తనను ట్రస్ట్ చైర్మన్ చేసిందని చెప్పారు. 
 
ట్రస్ట్ ను తాను సమర్థవంతంగా నడిపిస్తానని... పనితీరు చూడకుండా విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. తాను చట్టబద్ధంగానే ట్రస్ట్ చైర్మన్ అయ్యాయనని చీకటి జీవోలు అంటూ వస్తున్న ఆరోపణలు అబద్ధమని చెప్పారు. సీనియర్ ఎన్టీయార్ మహిళలకు వారసత్వ హక్కు కల్పించారని, పురుషులతో సమానంగా పని చేయగల సామర్థ్యం మహిళలకు ఉందని చెప్పారు. మహిళలను తక్కువగా అంచనా వేయవద్దని తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: