ఎట్టకేలకు ఏపీలో స్థానిక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే మొత్తం స్థానిక ఎన్నికలు జరిగిపోనున్నాయి. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికలు  వరుసగా జరగనున్నాయి. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వన్‌సైడ్‌గా గెలిచి, అధికారంలో ఉన్న వైసీపీకి స్థానిక సంస్థల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా అప్పుడు 23 సీట్లు తెచ్చుకుని దారుణ పరాజయం పాలైన టీడీపీ ఈసారి ఏ మేర సత్తా చాటగలదు అనేది చూడాలి.

 

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్థానిక పోరులో కూడా వైసీపీనే అత్యధిక సీట్లు గెలుస్తుందని రాజకీయ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 70 శాతంపైగా స్థానాలు గెలుచుకోవచ్చని చెబుతున్నారు. కానీ జగన్ 90 శాతం స్థానాలు గెలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టారు. దీంతో వారు మరింత కష్టపడటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బలంగా ఉన్న తెలుగు తమ్ముళ్లని ఫ్యాన్ గాలి కిందకు తీసుకురావాలని చూస్తున్నారు.

 

జగన్ ఎలాగో ఫ్యాన్ స్పీడ్ ఐదులో పెట్టేసి ఉన్నారు కాబట్టి, ఆ గాలి చాలా బాగుంటుందని చెప్పి మరి తమ్ముళ్లని లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు బలం తక్కువగా ఉన్న చోట్ల, పదవులు ఆఫర్ చేసి, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు వైసీపీ కండువా కప్పడానికి సిద్ధమయ్యారు. నామినేషన్ల కంటే ముందే ఆ కార్యక్రమం పూర్తి చేసి, ప్రచార బరిలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

 

దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో బలమైన టీడీపీ నేతలు ఎవరో ఉన్నారనేది తెలుసుకుని, వారిని పార్టీలోకి రప్పించే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీలో ఉంటే పెద్దగా లాభం లేదని అనుకుంటున్న తమ్ముళ్ళు, సమ్మర్‌లో సైకిల్ తొక్కలేమని చెప్పి, దాన్ని కింద పడేసి మరి ఫ్యాన్ గాలి కిందకు వెళ్లిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: