వైసీపీ మంత్రి కొడాలి నాని టీడీపీ, జనసేన అధినేతలపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి కోర్టుకు వెళ్లడం వల్లే బీసీలకు రిజర్వేషన్లు తగ్గాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలాఖరులోపు ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన 5,000 కోట్ల రూపాయల నిధులు విడుదలవుతాయని చెప్పారు. 
 
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డ్రామా ఆర్టిస్టులు అంటూ నాని ఘాటుగా విమర్శించారు. ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను చూసి చంద్రబాబు, టీడీపీ నాయకులు రోడ్లు ఎక్కుతున్నారని అన్నారు. చంద్రబాబు మనిషిగా సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదని చెప్పారు. టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మారాల్సిన సమయం ఆసన్నమైందని... ఆయన మారకపోతే ప్రజలు ఆయన తుప్పు పట్టిన సైకిల్ ను తుక్కుతుక్కుగా కొడతారని అన్నారు. 
 
చంద్రబాబు మాట్లాడే మాటలు అన్నీ చిల్లర మాటలు అని నాని అన్నారు. చంద్రబాబు ప్రతిసారి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని చెప్పారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ విసృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పేరుకే ప్రతిపక్షం ఉందని టీడీపీపై విమర్శలు చేశారు. ప్రతిఒక్కరూ సమన్వయంతో ఎన్నికల్లో వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తే విజయం వైసీపీ సొంతమవుతుందని చెప్పారు.                       

మరింత సమాచారం తెలుసుకోండి: