అసెంబ్లీ నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసే అవకాశముందా ?, ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకేతాలిచ్చారా ?? అంటే అవుననే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు .  సభను పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా  కోమటిరెడ్డి వ్యవహరించారని సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నవిషయం తెల్సిందే . సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై ప్రసంగించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  మిషన్ భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదని , చాల చోట్ల పనులింకా పెండింగ్ లోనే ఉన్నాయని పేర్కొన్నారు . ఈ విషయాన్నీ అధికారులే సమీక్షా సమావేశాల్లో అంగీకరిస్తున్నారని చెప్పారు .

 

చాలామంది టీఆరెస్ ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్నిచెబుతున్నారన్నారు . పాతవైపుల ద్వారానే నీటి సరఫరా జరుగుతుందని చెప్పారు . సభను తప్పుదోవ పట్టించే విధంగా  రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా  తప్పుబట్టారు . అంతటితో ఆగకుండా గతంలో ఆయన మిషన్ భగీరథ పనులు పూర్తయినట్లు, గ్రామ పంచాయితీ సర్పంచ్ లు చేసిన తీర్మానాలపై సంతకాలు చేసిన పత్రాలను స్పీకర్ కు అందజేశారు .  ఇంటింటికి మంచినీటి సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ పథకం ద్వారా 334 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని సర్పంచ్ లు చేసిన తీర్మానాలపై సంతకాలు చేసిన రాజగోపాల్ రెడ్డి, సభలో మాత్రం కేవలం 30 శాతం గ్రామాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని పేర్కొంటూ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ,  ఆయన పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కేసీఆర్  కోరారు .  

 

అయితే తాను వందకు వంద శాతం పనులు పూర్తయినట్లు ఎక్కడ చెప్పలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు . మిషన్ భగీరథ పథకం లోని లోపాలను ఎట్టి చూపుతూ , సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు మాత్రమే చేశానని అన్నారు . అయితే సభ ను తప్పుదోవ పట్టించిన కారణంగా రాజగోపాల్ రెడ్డి పై వేటు పడే  అవకాశముందని , అదే జరిగితే మునుగోడు ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: