ఎంత ఇంటర్ నెట్ యుగం అయినా.. పొద్దున్నే ఓ టీ తాగుతూ.. పేపర్ తిరగేస్తే ఆ మజాయే వేరు. అందుకే చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా.. ఫ్రీగా వాట్సప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో పీడీఎఫ్ పత్రికలు వస్తున్నా..ఇంకా దిన పత్రికను వేయించుకుంటూనే ఉన్నారు. దాదాపు నెలకు 200 వరకూ తమ బడ్జెట్ లో కేటాయిస్తున్నారు. అంత వరకూ ఓకే.. కానీ ఇటీవల మీరు మీ ఇంటికొచ్చే పత్రికను జాగ్రత్తగా గమనిస్తున్నారా.. ?

 

 

ఇప్పటి వరకూ గమనించకపోయినా.. ఇప్పుడు ఓ సారి చెక్ చేయండి.. రోజూ ఎన్ని పేజీలు వస్తోంది.. మీ పత్రిక.. 12 పేజీలా.. 14 పేజీలా.. 16 పేజీలా.. 18 పేజీలా.. 20పేజీలా.. అబ్బే అంత పర్టిక్యులర్ గా గమనించలేదండీ అంటారా..ఇకపై కాస్త గమనించండి.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దినపత్రికలు తమ రేట్లను తగ్గించకపోయినా.. పేజీల సంఖ్యను మాత్రం తగ్గిస్తున్నాయి. ఎందుకంటే.. మోడీ సర్కారు న్యూస్ ప్రింట్ ధరలను దారుణంగా పెంచేసింది.

 

 

ఇప్పటికే ఇంటర్ నెట్ యుగంలో నెట్లో ఫ్రీగా పేపర్ చదివే అవకాశం ఉన్నా.. నెలకు 200 వరకూ భరిస్తున్న చందాదారులనూ, పేపర్ కొని చదివే వాళ్లను ఇంకా ధరలు పెంచి ఇబ్బంది పెట్టలేరు. మరోవైపు యాడ్లు తగ్గిపోతున్నాయి. ప్రింటుకు పోటీగా ఇప్పుడు డిజిటల్ రంగం దూసుకొస్తోంది. అవి యాడ్ల విషయంలో పోటీకి వస్తున్నాయి. అందుకే ఇక పత్రికలకు ఉన్న వెసులుబాటు పేజీలు తగ్గించడమే.

 

 

అందుకే చాలా పత్రికలు పేజీల్లో కోత వేస్తున్నాయి. ఉదాహరణకు సీపీఎం నడుపుతున్న నవతెలంగాణ పత్రిక ఎనిమిది పేజీలే వచ్చింది. ఈ పేజీలు తగ్గించే పని ఒక్క నవ తెలంగాణ మాత్రమే చేయడం లేదు. గతంలో ఇబ్బడి ముబ్బడిగా పేజీలు ఇచ్చిన పెద్ద పత్రికలు సైతం కొన్ని రోజుల్లో చాలా తక్కువ పేజీలు అంటే 14 పేజీలతో సరిపెడుతున్నాయి. ఇక ముందు ముందు కేవలం ఆరు పేజీలు మాత్రమే వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: