పవన్ ది సూపర్ స్టార్ డం. ఆ క్రేజూ, మోజూ అన్నీ సినిమాల్లోనే. ఆయన సినిమాల్లో కూడా బ్లాక్ బస్టర్లూ, హిట్లూ పెద్దగా లేకపోయినా ఎందుకో ఆయన హవా మాత్రం అలా ఇలా ఉండదు. ఆయనను చూస్తే చాలు కుర్ర కారుకు  ఒకటే పూనకం వస్తుంది. కెవ్వు కేక పెడతారు. మొత్తానికి పాతికేళ్ళకు పైగా కష్టపడి చిరంజీవి మెగా స్టార్ ఇమేజ్ ని  సాధిస్తే పవర్ స్టార్ మాత్రం పదేళ్ళకే ఆ పెద్ద మెట్లు సులువుగా ఎక్కేశారు.

 

ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే.  అదే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే ఫ్లాప్ స్టార్ గా మిగిలిపోయారు. ఆయన రాజకీయం ఎందుకూ పనికిరాలేదు. ఆయన ఇమేజ్ కూడా ఎక్కడా కాపాడలేకపోయింది. లేకపోతే పవన్ ఏంటి, పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడమేంటి. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ తడవకు ఓ మారు పొత్తులు  మారుస్తున్నాడు.వాటి వెనక ఎత్తులు ఏమున్నాయో కానీ చిత్తు అవుతున్నాడు.

 

సరిగ్గా ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వామ‌పక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీకి దిగాడు. బాగా దెబ్బప‌డిపోయింది. దాంతో వారిని పక్కన పెట్టేసాడు. ఇపుడు బీజేపీ వద్దకు చేరాడు. ఈ బంధం కూడా పాతదే. బీజేపీతో, టీడీపీతో పవన్ 2014 ఎన్నికల్లో మిత్రుత్వం నెరిపాడు. అయితే నాడు ఆయన పార్టీ పోటీ చేయకపోవడం పెద్ద తప్పుగా మారింది.

 

ఇక ఇప్పటి విషయానికి వస్తే పవన్ బీజేపీ కలసి లోకల్ ఫైట్ లో జనం ముందుకు వస్తున్నారు. రెండు పార్టీలు కలసి గెలవాలనుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. అందులో వామపక్షాలకు ఎంత వాటా  ఉందో తెలియదు. ఇక బీజేపీకి ఒక శాతం ఓట్లుగా నమోదు అయింది. ఇపుడు ఈ ఇద్దరూ కలిస్తే లాభమా, నష్టమా అన్నది తేలనుంది.

 

నిజానికి లోకల్ బాడీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో బలం, బలగం ఉండాలి. ఈ రెండు పార్టీలకూ అది లేదు. పైగా టీడీపీ, వైసీపీ నలభై, యాభై శాతం ఓట్ల షేర్ తో రంగంలో ఉంటున్నాయి. దాంతో వాటిని తోసుకుని ఎంతవరకూ ఈ పొత్తుల పార్టీలు ముందుకు వస్తాయో చూడాలి. డ్యాం ష్యూర్ గా అన్ని సీట్లు గెలవకపోయిన కొన్ని చోట్ల అయినా ప్రభావం చూపిస్తేనే ఈ బంధం నిలుస్తుంది. లేకపోతే ఈ పొత్తుకు కూడా పవన్ చెక్ చెబుతాడా అన్న టాక్ కూడా నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: