తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా కొనసాగుతాయని అందరూ భావించారు . ఎందుకంటే ప్రతిపక్షం బలహీనంగా ఉండడమే దానికి కారణం . అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఈసారి సభలో అధికార పక్షాన్ని ధీటుగానే ఎదుర్కోవాలని డిసైడ్ అయినట్లు కన్పిస్తోంది . రెండవ రోజు సభ లో గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి  ఆయన ప్రసంగాన్ని పదేపదే అడ్డుకోవడం , దానికి సహచర కాంగ్రెస్ సభ్యులు కూడా మద్దతునివ్వడంతో...  స్పీకర్ కాంగ్రెస్ సభ్యులను  ఒకరోజు సభా కార్యకలాపాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు .

 

అయితే సభ నుంచి సస్పెండ్ అయిన కాంగ్రెస్  సభ్యులు నేరుగా మంత్రి కేటీఆర్ దిగా చెబుతున్న గెస్టు హౌస్ వద్దకు వెళ్లే ప్రయత్నం  చేయడం హాట్ టాఫిక్ గా మారింది .   గండిపేట కు చేరుకోగానే కాంగ్రెస్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి స్టేషన్ కు తరలించారు . తాము గెస్ట్ హౌస్ వద్దకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం పై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క , ఎమ్మెల్యే సీతక్కలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు . 111 జీవో ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని చూడకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు . అటు సభలోను , ఇటు బయట కాంగ్రెస్ సభ్యులు గతానికి భిన్నంగా దూకుడుగా వ్యవహరించడం చూస్తుంటే ... బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలున్నట్లు స్పష్టం అవుతోంది .

 

సభలో తగిన సమయం ఇవ్వకపోతే , సభ బయట ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు  తెలుస్తోంది . హైదరాబాద్ చుట్టూ పక్కల రెండు వేల ఎకరాల భూముల్ని టీఆరెస్ నేతలు ఆక్రమించిన విషయం ప్రజలకు తెలియాలని భట్టివిక్రమార్క మీడియా తో మాట్లాడుతూ పేర్కొనడం పరిశీలిస్తే , భూఆక్రమణలపై కాంగ్రెస్ ఉద్యమించాలని డిసైడ్ అయినట్లుగా కన్పిస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: