ఏపీ బీజేపీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే అనేక సమస్యలతో సతమతం అవుతూ రాజకీయంగా పై మెట్టు ఎక్కలేకపోతోంది.చెప్పుకోవడానికి జాతీయ పార్టీగా గొప్పగా ఉన్నా ఏపీ నాయకులు మాత్రం గల్లీ లీడర్ల కంటే తక్కువగా వ్యవహరిస్తూ తాము రాజకీయంగా పై మెట్టు ఎక్కలేకపోవడమే కాకుండా పార్టీ పరువును కూడా తీసేస్తూ ఏపీలో ఆ పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారారు. పార్టీ లో ఉన్న ఏపీ నాయకుల్లో ఎవరి మధ్య సమన్వయము లేదు. ఒక వర్గం నాయకులు జగన్ కు మద్దతుగా మాట్లాడుతుంటే, మరో వర్గం నాయకులు టిడిపి అధినేత చంద్రబాబు కు మద్దతు గా మాట్లాడుతున్నారు. మరో వర్గం వారు మాత్రం సమయాన్ని బట్టి అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. మొత్తంగా చూస్తే ఏపీ బీజేపీ శాఖలో కీలక నాయకులు ఏకాభిప్రాయం రావడం లేదు. 

IHG

 

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు దక్కించుకోలేకపోయింది. అంతే కాదు అత్యధిక స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయింది. అయినా గెలుపు మీద ఆశతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపి ఉత్సాహం చూపిస్తోంది. జనసేన పార్టీ కూడా తమకు అండగా ఉండటంతో ఫలితాలు మెరుగ్గా వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే జనసేన, బిజెపికి క్షేత్రస్థాయిలో అంతంతమాత్రంగానే బలం ఉండడంతో ఫలితాలు అదే స్థాయిలో వస్తాయని, ఆ పార్టీ నేతల్లో ఉన్న అభిప్రాయం. ఇదిలా ఉంటే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అమరావతి విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు వైసిపి కి అనుకూలంగా టిడిపి కి వ్యతిరేకంగా ఉండడంతో రాష్ట్ర బిజెపి నేతలు కూడా ఆయన వ్యవహారశైలిపై మండిపడుతున్నారు. 

 

ఈ విషయంలో టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. నాయకుల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం ముదురుతున్నా అధిష్టానం మాత్రం ఈ విషయంలో కల్పించుకునేందుకు ఇష్టపడటం లేదు. దీంతో అంతంతమాత్రంగా ఉన్న ఏపీ బిజెపి వరుస కుమ్ములాటలతో సతమతం అవుతోంది. పార్టీ ఉనికికి ఇప్పుడు ముప్పు వచ్చేలా కనిపిస్తోంది. ఈ కుమ్ములాటలతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మళ్ళీ అవమానం తప్పదనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: