కోట్లాది ఆస్తి, సమాజంలో గౌరవం, సామాజిక హోదా, కులంలో విలువ కలిగిన మిర్యాలగూడ మారుతీ రావు తన కూతురు అమృత కులం తక్కువ అబ్బాయైన ప్రణయ్ ని ప్రేమించిందని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఆమెను బెదిరించాడు, గృహనిర్బంధం చేశాడు. అయినా అమృత మాత్రం ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రణయ్ ని పెళ్లి చేసుకుంది. దాంతో తమ కుటుంబ పరువుని నడిరోడ్డున పడేసిందని బాధపడిన మారుతీ రావు తన కూతురి పై కక్ష సాధించాడు. తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురై కిరాయి హంతకుల ముఠా తో తన బిడ్డ భర్తని దారుణంగా హత్య చేయించాడు.



అస్సలు ఈరోజుల్లో అత్యంత సాధారణమైన తన కూతురి కులాంతర వివాహాన్ని మారుతీ రావు అంగీకరించాల్సింది అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఉద్వేగంతో సమన్వయం కోల్పోయిన మారుతీ రావు తన అల్లుడిని చంపేసి సరిదిద్దుకోలేని తప్పు చేసి, ఎవరికీ సమాధానం చెప్పుకొని పరిస్థితిలో పడిపోయాడు. ఈ కథలో అతను క్రూరమైన హంతకుడిగా, నేరస్థుడిగా మారి కొద్దిరోజుల పాటు జైలు జీవితం గడిపి బెయిలు మీద బయటకు వచ్చేసాడు. కానీ తన బిడ్డ మాత్రం తన తండ్రి కి అస్సలు భయపడలేదు. ఇప్పటివరకు ప్రణయ్ కుటుంబాన్నే అంటిపెట్టుకొని ఉంది. దాంతో మారుతీ రావు అహం బాగా దెబ్బతిన్నది.



మరోవైపు సమాజంలో అతనికి ఎన్నో ఎత్తిపొడుపులు, అవమానాలు ఎదురయ్యాయి. దీంతో సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇటీవల కాలంలో మారుతీ రావు పశాత్తపపడ్డట్టు తెలుస్తుంది. కూతురు తనకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని అంగీకరించకపోయినా అల్లుడిని చంపకుండా వాళ్ళ బతుకు వారిని బతకనిస్తే ఇంతవరకు వచ్చేది కాదని అతను బాగా కృంగి పోయినట్టు తెలుస్తోంది. అందుకే ప్రాయశ్చిత్తంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐతే తాజాగా మీడియా ముందుకు వచ్చిన అమృత కూడా తన తండ్రి పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది.


మారుతీ రావు ఆత్మహత్య ఈ కులాంతర వివాహ కథకి బాధాకరమైన ముగింపు పలికిందని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ మొత్తం కథలో మారుతీరావు, తన కూతురు అమృతా, ఇంకా ఇరువురి కుటుంబ సభ్యులు కూడా బాధితులుగానే మిగిలి పోయారు. అమృత విషయానికి వస్తే తన భర్తను కోల్పోయి, పుట్టిన బిడ్డకు తండ్రి ప్రేమని అందించలేక, ఇప్పుడు తన తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉందని తెలుస్తుంది. ఏదేమైనా ఉద్వేగం ఉన్మాదంగా మారితే చివరకు అందరూ మారుతీ రావు కుటుంబం లాగానే బాధితులు అవుతారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: