తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుడైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో ఆయన కూతురు అమృత స్పందించారు. ఆత్మహత్యపై ఇప్పుడే తాను ఏం చెప్పలేనని అమృత వ్యాఖ్యలు చేశారు. నాన్న ఆత్మహత్యపై తనకు క్లారిటీ లేదని చెప్పారు. తనకు అధికారికంగా తండ్రి మరణవార్త గురించి ఎటువంటి సమాచారం లేదని వ్యాఖ్యలు చేశారు. 
 
తన తండ్రి మృతికి సంబంధించిన వివరాలన్నీ తెలిసిన తరువాత మాత్రమే తాను స్పందిస్తానని అన్నారు. టీవీలో చూసే తండ్రి మృతి గురించి తెలిసిందని తెలిపారు. ప్రణయ్ హత్య తరువాత తండ్రితో టచ్ లో లేనని చెప్పారు. ప్రణయ్ ను చంపిన పశ్చాత్తాపంతోనే తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి మారుతీరావు ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో గదిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మారుతీరావును చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సైఫాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మారుతీరావు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మారుతీరావు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో కూతురు అమృత తల్లి దగ్గరకు వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది. మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు ప్రణయ్ ఇంటిముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 
 
అమృత నివాసం దగ్గర కూడా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. మారుతీరావుకు అతని సోదరుడికి మధ్య ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోదరుడితో గొడవలు, పోలీస్ కేసులు ఉన్న నేపథ్యంలో మారుతీరావు గత కొన్ని నెలల నుండి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఇటీవల మారుతీరావు షెడ్డులో కుళ్లిపోయిన స్థితిలో ఒక మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: