ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఈరోజు 2020 - 2021 బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.  హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల, అన్ని రంగాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ కులాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం ఎస్సీల ప్రత్యేక ప్రగతి కోసం 16,534.97 కోట్ల రూపాయలు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి 9771.27 కోట్ల రూపాయలు కేటాయించింది. 
 
ఈ రెండు కులాల విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ గృహావసరాల కోసం 101 యూనిట్ల ఉచిత చిద్యుత్ ను అందిస్తామని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ రుణాలను, మైక్రో ఇరిగేషన్ సబ్సిడీని రెట్టింపు చేస్తున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ ఛైర్మన్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లు ప్రకటన చేశారు. 338 కోట్ల రూపాయల పారిశ్రామిక రాయితీలు ఈ రెండు కులాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. 
 
ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో పేద.. మధ్య తరగతి వర్గాలకు, రైతులకు పెద్దపీట వేసింది. మంత్రి హరీశ్ రావు 1,82,914.42 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక బడ్జెట్ లో రెవిన్యూ వ్యయం 1,38,669.82 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం 22,061 కోట్ల రూపాయలుగా ఉంది. 33,191.25 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నట్లు హరీశ్ రావు తెలిపారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. బడ్జెట్ అంటే సామాజిక స్వరూపం అని కాగితాల్లో లెక్కలు కాదని వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టగా... శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: