అది పేరుకే జిల్లా ఆస్పత్రి. అక్కడ సమస్యలు జాస్తి. సౌకర్యాలు మాత్రం నాస్తి. కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక...ఇక్కడ వైద్యం అంటే నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్న చందంగా మారింది. అయితే...ఆస్పత్రిలో సమస్యలపై అధికారులు పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇక్కడికొచ్చే రోగుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. 

 

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి అధ్వానంగా తయారైంది. దీనికి వంద పడకల ఆసుపత్రిగా పేరుంది. అయితే అక్కడ ఆ స్థాయిలో సౌకర్యాలు లేవు. చిన్న పిల్లల వార్డులో ఒకే బెడ్‌పై నలుగురు పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. బెడ్‌పై పిల్లలు  పడుకోవటం కాదుకదా...కనీసం కూర్చోవడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి రోగాలు మరొకరికి వస్తాయేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క పేషెంటు ఒక్కో రోగంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా ఒకే బెడ్‌ నలుగురు పేషెంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పడుకోవడానికి బెడ్‌పై చోటు కూడా ఉండటం లేదు. పిల్లలని ఒళ్లోనే కూర్చోబెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఒక బెడ్‌పై ఒకే పేషెంట్ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

 


డాక్టర్లు కూడా రోగులను సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రోగులు కూడా సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్క పేషెంటు నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉంటున్నారు. అయితే...బెడ్స్ లేక ఒకే బెడ్‌పై నలుగురు పేషెంట్లు ఉన్న మాట వాస్తవమేనని వైద్యులు అంగీకరించారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రెండు వార్డులను తొందరలోనే ఏర్పాటు చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందని తెలిపారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చూస్తామంటున్నారు. వీలైనంత తొందర్లోనే పిల్లల వార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు డాక్టర్లు. ఇప్పటికైనా...అధికారులు చొరవ తీసుకొని గద్వాల జిల్లా కేంద్రం ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: