అవును జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక చట్టంతో యావత్ దేశమంతా ఇపుడు ఆంధప్రదేశ్ వైపే చూస్తోంది. ఇప్పటికే రివర్స్ టెండరింగ్, దిశ చట్టం లాంటి వాటితో వివిధ రాష్ట్రాల దృష్టిని తనవైపు తిప్పుకున్న జగన్ తాజాగా స్ధానిక సంస్ధల ఎన్నికల చట్టంతో మరో మారు అందరి దృష్టిని ఆకర్షించారనే చెప్పాలి. పంచాయితీ రాజ్ చట్టానికి చేసిన సవరణల కారణంగా స్ధానిక సంస్ధల నిర్వహణ చట్టం మరింత పదునుగా మారిపోయింది. ఈ చట్టం ఏ విధంగా ఆచరణలోకి వస్తుందనే విషయంపైనే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఈ నెలమొత్తం స్ధానిక సంస్ధలు అంటే ఎంపిటిసి, జడ్పిటిసి, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకే సరిపోతుంది. స్ధానిక ఎన్నికలంటేనే జనాలతో బాగా దగ్గర సంబంధాలుండే వారే ఎక్కువగా గెలుస్తారని అనుకోవచ్చు. కాబట్టే గ్రామ, మండల స్ధాయిలో ఈ ఎన్నికల్లో గెలవటాన్ని చాలామంది ప్రిస్టేజ్ గా తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రిస్టేజ్ అంశం తెరపైకి వస్తుందో అప్పుడు డబ్బులు వెదచల్లటం, మద్యాన్ని ఏరులుగా పారించటం, రౌడీయిజం లాంటివన్నీ మొదలవుతాయి. సరిగ్గా ఈ మూడు పాయింట్లపైనే జగన్ బాగా ఫోకస్ పెట్టాడు.

 

ఎన్నికల్లో డబ్బు, మద్యం, రౌడీయిజాన్ని పూర్తిగా నిరోధించటానికే జగన్ పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, రౌడీయిజం అన్న మాటే వినబడకుండా చేయాలనుకున్నారు. అందుకనే పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇచ్చాడు. ఎన్నికల ప్రచార రోజులను కూడా బాగా తగ్గించేశాడు. డబ్బులిచ్చి, మద్యాన్ని పంచి, రౌడీయిజానికి ఎవరైనా పాల్పడినట్లు రుజువైతే వారికి మూడేళ్ళు జైలుశిక్ష విధించేట్లు చట్టం తీసుకొచ్చాడు. అంతే కాకుండా తర్వాత ఎన్నికల్లో కూడా పోటి చేసేందుకు లేకుండా అనర్హత వేటు తెచ్చాడు.

 

ఈ చట్టం అమలుపై రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. తొందరలో జరిగే ఎన్నికలు గనుక సక్రమంగా, నిష్పక్షపాతంగా జరిగితే దేశంలోనే జగన్ కొత్త చరిత్రకు నాంది పలికినట్లవుతుంది. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించిన సిఎంగా జగన్ చరిత్ర సృష్టించటం ఖాయమనే చెప్పాలి.  అపుడు మిగిలిన రాష్ట్రాలు కూడా చట్టం అమలు విషయంలో ఏపిని ఆదర్శంగా తీసుకునే అవకాశాలున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: