సాధించాలనే తపన.. పట్టుదల ఉంటే కూలీ కూడా ప్రొఫెసర్ కావొచ్చని ఆమె నిరూపించింది. దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేసి.. తెలంగాణ యూనివర్సిటీలో తెలుగు విభాగం అధిపతిగా ఊహించని స్ధాయికి ఎదిగింది. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికై.. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుతోంది. 

 

డాక్టర్ త్రివేణి.. తెలంగాణ యూనివర్సిటీలో తెలుగు విభాగం అధిపతి. ఆత్మవిశ్వాసం, అంకితభావమే పెట్టుబడిగా కూలీ నుంచి ప్రొఫెసర్ స్ధాయికి ఎదిగింది డాక్టర్ త్రివేణి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలంలోని లాల్ గడి మల్ పేటలోని నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టింది త్రివేణి.. నాన్న నారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అమ్మ లక్ష్మినరసమ్మ బీడీ కార్మికురాలు. చిన్నప్పటి నుంచి ఉన్నత చదువులు చదవాలనే తపన ఉన్నా..ఆర్ధిక పరిస్ధితులు అడ్డుపడేవి. పదో తరగతిలో కుటుంబ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉండటంతో, చదువు మధ్యలో ఆపేసింది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకు.. పత్తి కంపెనీలో మూడేళ్ల పాటు కూలీగా పనిచేసింది. పార్ట్ టైంగా.. అనియత విద్యాకేంద్రంలో ఇన్స్ స్ట్రక్టర్ గా పిల్లలకు పాఠాలు బోధించింది. 

 

స్నేహితుల సూచనతో... ఏడాది గ్యాప్ తరవాత ప్రైవేట్ గా ఇంటర్ పూర్తి చేసి.. పాసయ్యింది. ఇంటర్ ఆమె జీవితాన్ని ములుపు తిప్పింది. ఆమెలో ఆత్మస్దైర్యాన్ని పెంచింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 1997లో డిగ్రీ...ఉస్మానియాలో పీజీ కూడా పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా పీహెచ్ డీ పూర్తి చేసి.. 2007లో తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధుల్లో చేరింది.  ప్రస్తుతం తెలుగు విభాగం అధిపతిగా ఉన్న డాక్టర్ త్రివేణి.. దేశవిదేశాల్లో సాహితీ వేదికలపై ప్రసంగాలు చేస్తూ.. యూనివర్సిటీ ప్రతిష్టను దశదిశలా చాటింది. 

 

జాతీయ అంతర్జాతీయ, ప్రాంతీయ సదస్సులో పరిశోధక పత్రాలు సమర్పించింది. వృత్తిపరంగా, భాషాపరంగా చేస్తున్న కృషికి అనేక పురస్కారాలు ఆమెను వరించాయి. సత్కారాలు దక్కాయి. గతేడాది తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపక అవార్డు 
అందుకుంది. త్రివేణి జీవితగాథను స్పూర్తిగా తీసుకున్నట్లు విద్యార్ధులు
చెబుతున్నారు. అచల సిద్దాంత పై చేసిన పరిశోధనలకు గాను.. డాక్టర్ త్రివేణి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైంది. బాదరాయణ్ వ్యాస సమ్మాన్ 2019- రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక కావడం తన జీవితంలో మరచిపోలేని గొప్ప వరంగా చెబుతోందామే. 

 

ఓ పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టి.. ప్రొఫెసర్ స్ధాయికి ఎదిగిన డాక్టర్ త్రివేణి ఎందరికో స్ఫూర్తిగా మారింది. త్వరలో రాష్ట్రపతి పురస్కారం అందుకోబోతున్న ప్రొఫెసర్ కు.. మనమూ ఆల్ ది  బెస్ట్ చెబుదాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: