జనసేన వీరమహిళ విభాగం ఆధ్వర్యంలో  మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వ‌హించారు. జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు. భారత ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ,  పాకిస్థాన్  ప్రధానిగా బెనజీర్ భుట్టో, శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయకే.. ఆ పదవుల్లో పని చేసిన విధానాన్ని  ఆదర్శంగా తీసుకొని మహిళలు రాజకీయ రంగంలో ఉన్నతస్థానాలకు ఎదగాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  ఆకాంక్షించారు.

 

భారత స్వాతంత్య్రం కోసం చాలా మంది మహిళలు తమ జీవితాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను భావి తరాలకు తెలియజేయాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. `స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీజీ మన రాష్ట్రంలో పర్యటించినప్పుడు చాలా మంది మహిళలు వారి ఆభరణాలు నిండు మనసుతో ఉద్యమం కోసం ఇచ్చారు.  ఆ రోజుల్లో తెనాలి ప్రాంతంలో తులసమ్మ అనే మహిళ సామాజిక పరిస్థితులు దాటి భర్తకు మరో వివాహం  చేసి, తన యావదాస్తిని స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఇచ్చి గాంధీజీ వెంట నడిచారు. చివరి రోజుల్లో ఆరోగ్యం బాగోలేక మంచంపడితే స్వయంగా గాంధీజీ ఆమెను చూడటానికి ఈ ప్రాంతానికి వచ్చారు. అంత గొప్ప మహిళలు మన ప్రాంతంలో ఉన్నారు.`` అని పేర్కొన్నారు.

 

ప్రతి ప్రభుత్వం మహిళలను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని, రక్షణ కల్పించాలని చట్టాలు చేస్తూనే ఉన్నాయని పేర్కొన్న ఆయ‌న వాటిని నిలబెట్టుకోవడం అందరి బాధ్యతగా మారాలని కోరారు. ``మహిళలు నిజాయితీగా వాస్తవాలు చెబుతారని పవన్ కళ్యాణ్ నమ్ముతారు. అందుకే వారు చేసే సూచనలను జాగ్రత్తగా వింటారు. చాలా పార్టీలు వారి మీటింగులకు కష్టపడి మహిళలను తీసుకొచ్చి ముందు వరసలో కూర్చొబెడతారు. జనసేన పార్టీకి ఆ అవసరం లేదు. యువతతో పోటీ పడి మరీ వీరమహిళలే స్వచ్ఛందంగా పార్టీ కార్యక్రమాలకు తరలి వస్తారు. పార్టీ బలోపేతం కోసం మండల, పట్టణ, గ్రామ, నియోజకవర్గ కమిటీలు వేసినట్లు... మహిళల కోసం కూడా కమిటీలు వేస్తాం``ని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: