తెలుగు రాజకీయాలు ఇపుడు హద్దు మీరిపోయాయి. అవి ఎక్కడ నుంచో మొదలై ఎక్కడికో వెళ్ళిపోయాయి. అందులో అన్ని రకాల జబ్బులూ వచ్చి చేరిపోయాయి. ప్రజా సేవ ఇంతలా చేసేందుకు ఎగబడే వారు ఎక్కువ అయిపోయారు. ఆ సేవకు పోటీ వచ్చే వారు ప్రత్యర్ధులు కాదు శత్రువులు అయిపోతున్నారు. వారిని సర్వనాశనం చేయడానికి రెడీ అయిపోతున్నారు.

 

ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలో రాజకీయ శత్రు శేషం ఉంచుకోకూడదన్న పంతంతో కధ దూకుడుగా సాగుతోంది. గత ఏడాది మాడుపగిలేలా ప్రజాతీర్పు టీడీపీకి వచ్చింది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చాయంటే  ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. సరే దాన్ని ఎలాగో దిగమింగుకుని ముందుకు సాగుతూంటే ఇపుడు స్థానిక ఎన్నికలు వచ్చేశాయి.

 

ఇవి చావో రేవో సమస్యగా టీడీపీకి మారాయి. అధికార వైసీపీకి కూడా ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవే. అయితే మరీ టీడీపీ అంత కాదు. పైగా  వారికి పరిస్థితి కూడా ఆశావహంగా ఉంది. అదే ఇపుడు టీడీపీని పీడిస్తోంది. ఎరక్కపోయి ఎన్నికల బరిలోకి దిగితే మళ్ళీ గత ఏడాది ఫలితాలు రిపీట్ అయితే పార్టీ గతేంకాను అన్నదే ఇపుడు పెద్ద తలకాయల్లో చర్చగా ఉంది.

 

ఏపీలో పదమూడు జిల్లాల్లో టీడీపీకి బాగుంది అన్న జిల్లా ఒక్కటి కూడా లేదు. దాంతో కంగారు ఒక్కసారిగా పెరిగిపోతోంది. పోటీ చేయకపోతే ఒక తంటా. చేస్తే మరో తంటా అన్నట్లుగా సీన్ ఉంది. తాజా పరిణామాలను బేరీజు వేసుకుంటున్న పసుపు శిబిరంలో నిలువెల్లా భయం ఆవహిస్తోందట.

 

ఇన్నాళ్ళూ వైసీపీ విజయాన్ని ఈవీఎంల మీద ఇతర కారణాల మీద తోసేసి కాలక్షేపం చేసిన టీడీపీకి ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల మీద జరుగుతాయి అని తెలుసు. ఇక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా జనం ఓట్లు గుద్దితే ఇక దుకాణం మూసుకోవాల్సిందేనని వణుకుతున్నారు.

 

ఇప్పటికే అసెంబ్లీలోపలా బయటా చంద్రబాబుని వైసీపీ నేతలు బతకనివ్వడంలేదు. లోకల్ ఫైట్లో కూడా పార్టీ ఓడితే ఇక తిరగనిస్తారా అది పెద్ద భయంగా ఉంది. దానికి మించి మరో భయం కూడా ఉందిట. అదేంటి అంటే పార్టీలో ఇంకా అరకొరగా ఉన్న తమ్ముళ్ళంతా లోకల్ బాడీ ఎన్నికల తరువాత డెసిషన్ తీసుకుంటారట. దారుణంగా ఓడితే గోడ దూకడాలు ఎక్కువైపోతాయి. అపుడు తెలంగాణా అసెంబ్లీ మాదిరిగా ఏపీలో విపక్షంగా టీడీపీ ఉనికి ఉండకపోవచ్చునన్న ఆలోచనే పచ్చ పార్టీ పెద్దలకు నిద్రపోనీయడంలేదుట.

మరింత సమాచారం తెలుసుకోండి: