ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల ఫీవర్ వచ్చింది. స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నెలాఖరుకు ఈ ఎన్నికలు పూర్తవుతాయి. అయితే ఎన్నికల ఖర్చు తప్పించేందుకు ఏకగ్రీవం అయిన గ్రామాలకు ప్రభుత్వం నగదు అవార్డులు ఇస్తుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం అలాంటి నగదు బహుమతులను ప్రకటించింది.

 

 

గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయన్న సంగతి తెలిసిందే. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు.. పార్టీల ప్రస్తావన ఉండదు. అంతే కాదు.. గ్రామాల్లో ఎన్నికలంటే.. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రాజకీయ సమరం ప్రారంభమవుతుంది. అయితే గ్రామ సంక్షేమం కోసం ఎన్నికలు ఏకగ్రీవం అయితే.. ప్రభుత్వం ఎన్నికల ఖర్చులు మిగులుతాయి కాబట్టి నగదు ప్రోత్సాహకం అందిస్తారు.

 

 

ఈ సారి కూడా ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించడానికి నగదు అవార్డులను జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇస్తారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు.

 

 

అయితే ఏకగ్రీవం పేరుతో గ్రామాల్లో అరాచకాలు జరుగుతుంటాయి. చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవికి వేలంపాట జరుగుతుంది. అంటే డబ్బున్న వాళ్లదే రాజ్యంగా మారుతుంది. ఇందుకు అడ్డువచ్చి ఎవరైనా పోటీకి నిలబడతామంటే.. ఇక గ్రామాల్లో గొడవలు ముదురుతాయి. అందుకే ఇలాంటి వేలంపాటలను ప్రభుత్వం నియంత్రించాల్సి ఉంది. గ్రామాలు స్వచ్చంధంగా ఏకగ్రీవం అయితే మంచిదే. దీని ద్వారా లభించే నగదును గ్రామాభివృద్ధికి వాడుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: