అక్షరాల మీద వ్యామోహ‌మో, తెలిసీ తెలియ‌ని అజ్ఞాన‌మో, బ‌తుకుతెరువు కోసం ప్రయ‌త్నమో... మొత్తానికి అనేక కారణాలతో జర్నలిస్టులు పుట్టుకొస్తారు. మరి వారి జీవితాలు ఎలా ఉన్నాయి.. నేటి జర్నలిస్టుల జీవితాలపై సీనియర్ జర్నలిస్టు ఎం. సాంబశివరావు తన ఫేస్ బుక్ వాల్ పై రాసుకున్న నేరాంగీకారపత్రం.. ఓసారి చూద్దాం..

 

 

" అక్షరాల మీద వ్యామోహ‌మో, తెలిసీ తెలియ‌ని అజ్ఞాన‌మో, బ‌తుకుతెరువు కోసం ప్రయ‌త్నమో... మొత్తానికి అనేక కారణాలతో అనేక కార‌ణాలు న‌డిపిస్తే న‌డిచిన వాళ్లం.. వార్తలో ట్రైనింగ్ తీసుకుని జ‌ర్నలిస్టులమ‌నిపించుకున్నాం. మొన్నీమ‌ధ్యనే నిజాం క్లబ్‌లో రీయూనియ‌న్‌.. జోష్ వాట్సప్‌ గ్రూప్‌లో ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అదే రోజున ప్రభాక‌ర్ అనే జ‌ర్నలిస్టు మిత్రుడు ఆఖ‌రుసారిగా హుసేన్ సాగ‌ర్‌లో క‌నిపించాడ‌ట. ఆ మ‌ర్నాడు పేప‌ర్‌లో చూసిన ద‌గ్గర్నుంచీ ఇప్పటివ‌ర‌కూ గుర్తొస్తూనే ఉన్నాడు.

 

 

ఆంధ్రజ్యోతిలో క‌లిసి ప‌నిచేయ‌లేదు కానీ, సిగ‌రెట్ చాయ్ ద‌గ్గర క‌లిసేవాడు. ఉత్సాహి. మ‌స్తు టాలెంటున్నోడు. స్వాతిలో సీరియ‌ల్‌, టీవీలో పిన్‌కౌంట‌ర్‌, ఓ సినిమాకి మాట‌లు...! అర్థంత‌రంగా వెళ్లిపోవ‌డానికి వంద‌కార‌ణాలు పైకి క‌నిపించొచ్చు కానీ జ‌ర్నలిజ‌మే ప్రథ‌మ‌ ముద్దాయి అని నా న‌మ్మకం . ఉద్యోగ‌ముంటే ఒత్తిడీ , అది లేక‌పోతే అనిశ్చితీ, అందులో నుంచి పుట్టుకొచ్చే డిప్రెష‌నూ !

 

 

ఇక ఈ మ‌ధ్యకాలంలో ముగ్గురు నలుగురు మిత్రులు ఆఫీసులో కుప్పకూలిపోవ‌టం, ఏ కేర్ ఆస్పత్రిలోనో, స్టార్ ఆస్పత్రిలోనో కోలుకోవ‌టం చూశాను. ఒత్తిడి బాబూ ఒత్తిడి. బీబీసీలో ఉన్న మా రామ్మోహ‌న్ సిద్ధాంతి, జ‌ర్నలిజ‌మూ - ఒక ఒత్తిడీ అనే స‌బ్జెక్టును తీసుకుంటే బ్రహ్మాండంగా సిద్ధాంతీక‌రించ‌గ‌ల‌డు. ఈ మ‌ధ్య మానివేత‌కు గురైన నా ఫ్రెండ్ ఒక‌డు, ఖాళీగా ఉంటూ బీపీ త‌గ్గింద‌ని హ్యాపీగా చెప్పాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు 160.. ఇప్పుడు 110. అయితే అత‌డు ఫుడ్ కోసం కాక‌పోయినా, పల్స్‌పోలియో ఖ‌ర్చుల‌కోస‌మైనా మ‌ళ్లీ ఉద్యోగం చూసుకోక త‌ప్పదు. అప్పుడు మ‌ళ్లీ బీపీ పెర‌గ‌కా త‌ప్పదు. విష‌వ‌ల‌యం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: