జర్నలిస్టులు సమాజానికి దర్పణాలు.. కానీ ఆ దర్పణాలు బాగా పని చేస్తున్నాయా.. లేక అమ్ముడుతుపోతున్నాయా అన్న అనుమానం కలుగుతుంది. ఓ రిపోర్టర్ మంచోడైతే ఏం జరుగుతుంది.. చెడ్డవాడైతే ఏం జరుగుతుంది.. అన్న అంశంపై ఓ పాత్రికేయుని స్వీయ అనుభవం ఇది. ఇటీవల సోషల్ మీడియాలో జర్నిలిస్టు గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఈ సందేశం మీకోసం..

 

 

ఓ జర్నలిస్ట్ ఒకరోజు ఎప్పటిలాగే తహసీల్దార్ ఆఫీసు సందర్శనకు వెళ్తుండగా.. మెట్ల వద్ద ఓ రైతు దిగాలుగా కూర్చున్నాడు. ఏం అయిందని అడిగితే.. ‘అయ్యా.. మా అయ్య పేర మీద ఉన్న భూమిని నా పేరు మీదికి ఎక్కియ్యడానికి.. మా ఊరి వీఆర్వో పది వేలు తీసుకున్నడు. ఆరు నెలలు దాటింది. ఆఫీసుకు వస్తే కనబడత లేడు. ఎమ్మార్వో సార్​కు చెప్పుదామన్నా.. సార్​బిజీగా ఉన్నడని లోపలికి పోనిస్తలేర’ అని గోడు వెళ్లబోసుకున్నాడు. విషయం ఏమిటంటే రైతు దగ్గర డబ్బులు తీసుకున్న వీఆర్వో పని చేయకుండా మొఖం చాటేస్తున్నాడు. రైతు తహసీల్దార్​దగ్గరకు పోకుండా.. గేటు వద్ద ఉండే అటెండర్​కు డబ్బులు ఇచ్చి మరీ ఆపుతున్నాడు. ఈ విషయం గ్రహించిన విలేకరి. రైతును తీసుకొని నేరుగా.. తహసీల్దార్​దగ్గరకు వెళ్లాడు. తప్పు దొరికింది కదా.. అని ఆఫీసర్​పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా.. సర్​ఈ రైతు పరిస్థితి ఇదీ అని నెమ్మదిగా స్పష్టంగా చెప్పాడు.

 

 

 

స్పందించిన తహసీల్దార్​వీఆర్వోను పిలిపించి చెడామడా వాయించడంతోపాటు రూ. 10 వేలు రైతుకు తిరిగి ఇప్పించారు. రెండు రోజుల్లో పని పూర్తి చేసి నేనే పట్టాపాసు బుక్​ మీ ఇంటికి పంపుతా అని తహసీల్దార్​రైతుకు చెప్పారు. రైతు కండ్లళ్ల నీళ్లు తిరిగినయి. ఇన్ని రోజులు తిరిగితె కాని పని ఒక్క రోజులో అయింది. పైగా తన డబ్బులు తనకు వచ్చినయి. బయటకు వచ్చిన తర్వాత రైతు మన విలేకరికి రూ. 5 వేలు ఇయ్యబోయాడు. డబ్బులు ఏమొద్దు పెద్దాయన జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. చిన్న విషయాన్ని పెద్దగా చేసి తహసీల్దార్​ ఆఫీసులో వసూళ్ల పర్వం అని హెడ్డింగులు పెట్టి అక్కడ పని చేసే వారందరూ అవినీతి పరులే అన్నట్లుగా వార్త రాయకుండా.. విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో మన రిపోర్టర్​ అంటే తహసీల్దార్​కు గౌరవం పెరిగింది. అదే సమయంలో సదరు వీఆర్వోకు భయం పెరిగింది. రైతుకు మనపై నమ్మకం కలిగింది.

 

 

ఇలా కొంతకాలం గడిచింది. మండల పరిధిలోని ఓ తండాలో అత్తమామ ఓ కోడలిని దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. రిపోర్టర్లు అందరూ వెళ్లారు. డెడ్​బాడీ చూశారు. మన రిపోర్టరూ వెళ్లాడు. డెడ్​బాడీ చూశాడు. కొంత అనుమానం కలిగింది. అందరూ ఫొటో తీసుకొని తిరిగొచ్చారు. ఇంతలో మన రిపోర్టర్​ఫోన్​ రింగ్​అయింది. లిఫ్ట్​ చేయగా.. సార్​ మా తండాల ఆ అమ్మాయిని అత్తమామనే చంపిన్రు రాత్రి. మా ఇంటి పక్కనే ఉండటంతో మాకు అరుపులు వినిపించాయిని ఓ వ్యక్తి చెప్పాడు. మన రిపోర్టర్​అనుకున్నది నిజమే అయింది. అది సరే పెద్దమనిషి ఇంతకీ నువ్వు ఎవరూ? అని అడిగాడు.. అయ్యో సార్​ నాకు తహసీల్దార్​ఆఫీసుల వీఆర్వోతోని పైసలిప్పియ్యలేదా.. నేను అన్నాడు. మన రిపోర్టర్​కు గుర్తొచ్చింది. రైతు చెప్పిన వివరాలతో వార్త ఫైల్​చేశాడు.

 

 

 

అన్ని పేపర్లలో వివాహిత ఆత్మహత్య అని వార్త వచ్చింది. మన విలేకరి పత్రికలో మాత్రం.. కట్నం కోసం హత్య అనే హెడ్డింగ్​తో ఫస్ట్​పేజీలో పేలింది. పలు అనుమానాలు అన్న కోణంలో వార్త వివరంగా రాశాడు. పోలీసులు సహా.. మిగతా రిపోర్టర్లు ఆశ్చర్యపోయారు. మండల కేంద్రంలో ఉండే విలేకరికి ఎక్కడో తండాలో జరిగిన హత్య విషయం ఎలా తెలిసిందా? అని. పోలీసులు దర్యాప్తు చేస్తే..హత్య నిజమేనని తేలింది. పోలీసులకు కూడా మన రిపోర్టర్ పై గౌరవం, భయం రెండూ పెరిగాయి. మన రిపోర్టర్​ వార్త ద్వారా సెంటర్​లో కింగ్​అనిపించుకున్నాడు.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. ఇక్కడ మన రిపోర్టర్​మాట సాయంతో ఓ రైతుకు సాయం చేస్తే.. ఆ సాయం మరిచిపోని రైతు.. ఓ వార్తకు మంచి సోర్స్​గా ఉపయోగపడ్డాడు.

 

 

 

అదే రిపోర్టర్ వీఆర్వో డబ్బులు తీసుకున్న విషయంపై మన రిపోర్టర్​వీఆర్వోను కలిసి డబ్బులు తీసుకున్న విషయంపై వార్త రాస్తా అంటూ బ్లాక్​మెయిల్​చేసి ఉంటే.. ఆ రోజు రూ. 10 వేలు జేబులో పడేవి కావొచ్చు. అలా చేసి ఉంటే ఆ వీఆర్వో ఆ రిపోర్టర్​కు ఓ రేటు కడతాడు. ఫలానా రిపోర్టర్​కు ఇంత ఇస్తే.. వార్త రాయడు అని. ఒక్కసారి అలాంటి పేరు వస్తే ఎన్ని మంచి పనులు చేసినా.. మంచి పేరు సంపాదించుకోలేదు. పైగా అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన రిపోర్టర్​డబ్బుకు అమ్ముడుపోవడం ద్వారా రైతుకు అన్యాయం చేసినట్లు అయ్యేది. తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తహసీల్దార్​కు విషయం తెలిస్తే.. ఆయన కూడా ఆ రిపోర్టర్​పై సదభిప్రాయం ఉండేది కాదు. పాత్రికేయ వృత్తిలో విలువలతో పని చేసేవారికి, సహృదయంతో స్పందించేవారికి, మానవత్వంతో జీవించేవారికి సమాజంలో మంచి విలువ ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: