ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు... ఇతర కీలక నేతకు సవాల్‌గా మారాయి. పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఫలితాల విషయంలో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరి నియోజకవర్గాల్లో అయితే ఫలితాలు పార్టీకి వ్యతిరేకంగా వస్తాయో ? వారిపై చర్యలు తప్పవని హెచ్చ‌రించేశారు. మంత్రులు నియోజకవర్గాల్లో ఫలితాలు వారిని క్యాబినెట్ నుంచి త‌ప్పిస్తానని చెప్పగా... ఇక ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం ఫ‌లితాలు తేడా వ‌స్తే వచ్చే ఎన్నికల్లో మొహమాటం లేకుండా టిక్కెట్లు ఇవ్వాలని ప్రకటించేశారు. దీంతో ఇప్పుడు మంత్రులు.... ఎమ్మెల్యేలు... సీనియర్ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా భారీ మెజార్టీతో గెలిచినా... ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల్లో గెలవకపోతే ఎక్కడ తమ మెడపై వేటు కత్తి  వేళాడుతుందో అన్న‌ ఆందోళనతో ఉన్నారు.



ఈ క్ర‌మంలోనే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి తానేటి వ‌నిత ప‌రిస్థితి సైతం అలాగే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో వ‌నిత 23 వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించి జ‌గ‌న్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అయితే వ‌నిత‌కు ముందు సైతం కొవ్వూరులో జ‌వ‌హ‌ర్ మంత్రిగా ప‌నిచేశారు. ఆయ‌న ఏ గ్రూపు రాజ‌కీయాల‌కు చివ‌ర‌కు కొవ్వూరు నుంచి త‌ప్పుకున్నారో ఇప్పుడు వైసీపీలోనూ అదే గ్రూపు రాజ‌కీయాలు కొవ్వూరులో రాజ్య‌మేలుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రినే ఆమె ప్రోత్స‌హిస్తున్నార‌ని.. పార్టీ కోసం ముందునుంచి క‌ష్ట‌ప‌డిన వాళ్ల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని.. జ‌వ‌హ‌ర్ విష‌యంలో ఏం జ‌రిగిందో ఇప్పుడు వ‌నిత విష‌యంలోనూ కొవ్వూరులో అదే రాజ‌కీయం పున‌రావృతం అవుతుంద‌ని అంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.



నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు సెట్ చేసుకోవ‌డంలో వ‌నిత ఫెయిట్ అవ్వ‌డంతో ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రీ అంత సానుకూలంగా వ‌చ్చేలా లేవు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న కొవ్వూరు, చాగ‌ల్లు, తాళ్ల‌పూడి మండలాల‌తో పాటు కొవ్వూరు మున్సిపాల్టీలో టీడీపీ నుంచి వైసీపీకి గ‌ట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్ప‌టికే మంత్రిగా ఆమెకు అంతంత మాత్రంగానే జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు ఉన్నాయి. మీడియాలోనూ ప్ర‌భుత్వం త‌ర‌పున‌, త‌న శాఖా ప‌రంగా బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డం లేద‌ని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.



ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో కొవ్వూరు మున్సిపాల్టీ, కొవ్వూరు, చాగ‌ల్లు మండ‌లాల్లో టీడీపీ నుంచి వైసీపీకి గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. ఇక్క‌డ క‌నుక వైసీపీ ఓడిపోతే మంత్రి వనిత‌కు జ‌గ‌న్ మార్క్ షాక్ త‌ప్ప‌ద‌నే అనుకోవాలి. మ‌రి వ‌నిత స్థానికంలో గ్రూపుల‌ను ఏక‌తాటిమీద‌కు తెచ్చి ఎలా నెగ్గిస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: