ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ రావడంతో రాజ‌కీయం రంజుగా మారుతోంది. వ‌రుస‌గా ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీలు, మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌తో పాటు పంచాయ‌తీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో అటు ప‌ల్లెల నుంచి ఇటు ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా సంద‌డే నెల‌కొంది. గ‌తేడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 151 స్తానాల్లో తిరుగులేని విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇప్పుడు స్తానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి టీడీపీని పూర్తిగా కోలుకోకుండా చేయాల‌ని చూస్తున్నారు. ఈ ఎన్నిక‌లు అటు జ‌గ‌న్ 9 నెల‌ల పాల‌న‌కు కూడా రిఫ‌రెండం కానున్నాయి.



ఇక ఈ 9 నెల‌ల పాల‌నా కాలంలో జ‌గ‌న్ చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌తో పాటు ఇంటింటికి పాల‌న అందించ‌డం.. గ్రామ స‌చివాల‌యాలు... వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా జ‌గ‌న్ చాలా వ‌ర‌కు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు అందించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ చాలా వ‌ర‌క పంచాయ‌తీల‌ను వైసీపీకి అనుకూలంగా ఏక‌గ్రీవం అయ్యేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ ముందుగా ఎక్కువ పంచాయ‌తీల‌ను ఏక‌గ్రీవం చేయ‌డం లేదా ఎన్నిక‌లు జ‌రిగితే భారీ మెజార్టీల‌తో వీటిని గెలుచుకునేలా చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.



ఇక్క‌డ ఎక్కువ పంచాయ‌తీలు గెలిస్తేనే గ్రామ‌స్థాయిలో వైసీపీకి మంచి ప‌ట్టు చిక్కుతుంది. ఈ క్ర‌మంలోనే ఈ నెల 27, 29న జ‌రిగే పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పంచాయ‌తీలు అన్ని వైసీపీకి అనుకూలంగా వ‌న్‌సైడ్ అయ్యేలా ఫ‌లితాలు రావాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆయా గ్రామాలకు, గ్రామ పంచాయతీలో జనాభాను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే పంచాయ‌తీ రాజ్ శాఖ ప్ర‌భుత్వానికి త‌న నివేదిక అంద‌జేసిన‌ట్టు కూడా స‌మాచారం. దీనిపై రేపో మాపో జీవో కూడా విడుద‌ల కానుందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: