వైసిపి తరపున కేటాయించిన నాలుగు రాజ్యసభ స్ధానాల్లో మొదటిసారి పార్టీకి సంబంధం లేని వ్యక్తికోసం జగన్మోహన్ రెడ్డి కేటాయించాడు. అంటే పార్టీ పెట్టిన దగ్గర నుండి వైసిపి తరపున రాజ్యసభ ఎంపిలను పంపే అవకాశం రావటం ఇది మూడోదే లేండి. మొదటిసారి విజయసాయిరెడ్డిని, రెండోసారి వేమిరెడ్డి  ప్రభాకర్ రెడ్డిని జగన్ ఎంపిక చేశాడు. మొన్నటి ఎన్నికల్లో సాధించిన బంపర్ మెజారిటి పుణ్యమా అని ముచ్చటగా మూడోసారి ఏకంగా నాలుగు రాజ్యసభ స్ధానాలను భర్తీ చేసే అవకాశం వచ్చింది.

 

వైసిపి తరపున నాలుగు స్ధానాలు భర్తీ  అవుతోంది  కాబట్టే మొదటిసారి బయట వ్యక్తికి ఇవ్వాల్సిన అగత్యం వచ్చింది.  రిలయన్స్ అధినేత, అపరకుబేరుడు ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్, పరిమళ్ ధీరజ్ నత్వానీకి నాలుగో స్ధానాన్ని జగన్ కేటాయించాడు. ఓ వారం క్రితం నత్వానీ కోసం ఏకంగా ముఖేషే అమరావతికి వచ్చి జగన్ తో భేటి అవ్వటం సంచలనంగా మారింది. సరే అంబానీ అంతటి వ్యక్తి వచ్చి ఓ స్ధానం కావాలంటే కాదనే అవకాశం దాదాపు ఉండదు.

 

కాకపోతే ముఖేష్ అడగ్గానే జగన్ ఎగిరి చంకలో ఎక్కి కూర్చోకుండా ఆలోచించుకుని చెబుతానన్నాడు.  మొత్తానికి  వారం తర్వాత చివరకు ఓ స్ధానాన్ని బయటవారి కోసం త్యాగం చేసినట్లే అనుకోవాలి. జగన్ ఓ సీటును త్యాగం చేసినందుకు ఏమైనా ఫలితం దక్కితే అదే పదివేలు. అప్పుడే వ్రతం చెడ్డా ఫలితం దక్కిందనే తృప్తయినా దక్కుతుంది. ముఖేష్ కోరికను జగన్ మన్నించాడు కాబట్టి దానికి బదులుగా రాష్ట్రంలో రిలయన్స్ అధినేత ఏవైనా పెట్టుబడులు పెడతాడా ? లేకపోతే వ్యాపార విస్తరణపై దృష్టి పెడతాడా ? అన్నది చూడాలి.

 

రెండింటిలో ఏది జరిగినా వ్యక్తిగతంగా జగన్ కు రాష్ట్రానికి కూడా ఉపయోగమే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడు, పచ్చమీడియా పెట్టుబడుల విషయంలో నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖేష్ గనుక పై రెండింటిలో ఏది చేసినా వాళ్ళ నోళ్ళని మూతపడిపోతాయి. పైగా ఇతర పారిశ్రామికవేత్తలు కూడా ఏపికి క్యూ కట్టే అవకాశాలున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: