రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ నగరంలో స్థానిక ఎన్నికల పోరులో ఇద్దరు బడా నేతలు ఢీ అంటే ఢీ అనబోతున్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో తమతమ పార్టీలని గెలిపించేందుకు తెగ కష్టపడుతున్నారు. డివిజన్ల వారీగా తిరుగుతూ, ప్రజలతో మమేకమవుతున్నారు. అలా విజయవాడ నగరంలో కష్టపడుతున్న నేతలు ఎవరో కాదు. ఒకరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కాగా మరొకరు ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దేవినేని అవినాష్.

 

మొన్న ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గద్దె రామ్మోహన్, తన తూర్పు నియోజకవర్గ పరిధిలో బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉంటూనే, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారు. అలాగే తమ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్ నిధులతో నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు రావడంతో తూర్పు నియోజకవర్గ పరిధిలో ఉన్న డివిజన్లలో పార్టీని గెలిపించుకునేందుకు కష్టపడుతున్నారు.

 

అటు వైసీపీలో చేరి తూర్పు ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో కష్టపడుతున్నారు. అధికార పార్టీలో ఉండటం వల్ల ఆయన ప్రజల సమస్యల తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్స్ అందిస్తున్నారు. అయితే అవినాష్ కష్టపడిన, విజయవాడ ప్రజలు కాస్త వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

 

జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుని నగర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీకి అనుకూలమైన ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంది.   దీంతో దేవినేని అవినాష్‌కు షాక్ తగిలే ఛాన్స్ కూడా ఉంది. అయితే అధికారంలో ఉండటం వైసీపీకి ఉండే అడ్వాంటేజ్ దాని వల్ల ఫలితంలో ఏమన్నా మార్పు వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. మరి చూడాలి విజయవాడ కార్పొరేషన్‌లో షాక్ ఎవరికి తగులుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: