గుడివాడ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కొడాలి నాని. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడ కొడాలి నాని దెబ్బకు వైసీపీ కంచుకోట అయిపోయింది. గత రెండు ఎన్నికల నుంచి ఇక్కడ కొడాలి నానీని ఎదురుకునే సత్తా టీడీపీలో ఎవరికి లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కొడాలి నాని గెలిచి సత్తా చాటారు. ఇక 2019 ఎన్నికల్లో గెలవడం, ఇటు వైసీపీ అధికారంలోకి రావడంతో కొడాలి నాని మంత్రి అయిపోయారు. మంత్రి అయిన దగ్గర నుంచి తన శాఖపై పట్టు తెచ్చుకుని, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు.

 

ఇక ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో, కృష్ణా జిల్లాలో అందరి కళ్ళు గుడివాడపై పడ్డాయి. గుడివాడలో కొడాలి నాని టీడీపీని ఢీకొట్టి, ఏ మేర వైసీపీని గెలిపిస్తారని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే పరిస్థితులు చూస్తుంటే కొడాలి నానికి బాగా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే ఒక్క జెడ్‌పి‌టి‌సి స్థానం విషయంలో నాని కొంచెం గట్టిగా పడాల్సిన అవసరముందని తెలుస్తోంది.

 

మామూలుగా గుడివాడలో ఎక్కువ శాతం ఎం‌పి‌టి‌సి స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలున్నాయి. దాదాపు 70 శాతం ఎం‌పి‌టి‌సి స్థానాలు కొడాలి నానినే కైవసం చేసుకోగలరు. అటు నందివాడ, గుడివాడ రూరల్ జెడ్‌పి‌టి‌సి స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడటం ఖాయమని తెలుస్తోంది. అయితే టీడీపీ కంచుకోటగా ఉన్న గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి స్థానంలో వైసీపీని గెలిపించాలంటే కాస్త ఎక్కువ కష్టపడాలి.

 

గుడ్లవల్లేరు ఎప్పుడు టీడీపీ ఖాతాలోనే పడుతుంది. 2014లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా గుడ్లవల్లేరులో టీడీపీనే గెలిచింది. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మండలంలో కొడాలి నానికి 900 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక దీని బట్టి చూసుకుంటే గుడ్లవల్లేరు జెడ్‌పి‌టి‌సి స్థానంలో కూడా వైసీపీనే గెలిచేయొచ్చు. కాకపోతే స్థానిక సమరం నేపథ్యంలో ఇక్కడ టీడీపీ కేడర్ గట్టిగా కష్టపడుతుంది. మరి దీంతో గెలుపు కోసం కొడాలి నాని కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరముంది. మొత్తానికైతే కొడాలి నానికి గుడ్లవల్లేరు మండలంతో కాస్త తలనొప్పి ఉండేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: