భార‌త‌దేశంలో క‌రోనా క‌ల‌కలం కొన‌సాగుతోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో ఇంకా ఈ వ్యాధి భ‌యాందోళ‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్  ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమై కరోనాను అరికట్టేందుకు ఢిల్లీలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. కాగా, స‌రిగ్గా ఇదే రోజు కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న ఓ రోగి ఆస్పత్రి నుంచి పారిపోవ‌డం గ‌మ‌నార్హం.

 

స‌మావేశం అనంతరం కేంద్ర‌మంత్రి హర్షవర్ధన్‌ మీడియాతో మాట్లాడుతూ జనవరి 18వ తేదీ నుంచి దేశంలో ప్రముఖమైన ఏడు ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇప్పుడు 30 ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్‌ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 8,74,708 మంది ప్రయాణికులను స్క్రీనింగ్‌ చేశామని తెలిపారు.  ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటు, క్వారంటైన్‌ సౌకర్యాలు, డాక్టర్ల లభ్యతతో ఇతర అంశాలు చర్చకు వచ్చాయని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.  ఒకవేళ ఢిల్లీలో కేసులు పెరిగితే ఏం చేయాలనే అంశాలపై ఢిల్లీ ప్రభుత్వంతో చర్చించామని  కేంద్ర మంత్రి తెలిపారు.  కరోనా వైరస్‌ దేశంలో వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలను తీసుకున్నామని తెలిపారు. 

 

ఇదిలాఉండ‌గా, కర్ణాటకలోని మంగళూరులో క‌రోనా బాధితుడు ఒక‌రు క‌ల‌కలం సృష్టించాడు. స‌ద‌రు వ్య‌క్తి ఆదివారం ఉదయం దుబాయి నుంచి మంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతను తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. కరోనా వైరస్‌ లక్షణాలను కలిగి ఉన్నాడు. దీంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు రోగి వైద్యులకు సహకరించకుండా.. ఆస్పత్రి నుంచి పారిపోయాడు. తాను ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని అతను చెప్పినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌ సింధూ బీ రూపేష్ ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ``దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి తీవ్ర జ్వరం ఉంది. గత రాత్రి జిల్లా ఆస్పత్రికి అతడిని తరలించాం. కానీ వైద్యులకు అతను సహకరించడం లేదు. పారిపోయిన అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో చేర్పించేందుకు ఒప్పించాం` అని తెలిపారు. 

 


ఇదిలాఉండ‌గా, ఈ నెల 17వ తేదీన బంగ్లాదేశ్ లో జరగనున్న షేక్ ముజిబుర్ రెహమాన్ శతాబ్ది జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఆ దేశ ప్రధాని షేక్ హాసినా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దీంతో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ కు వెళ్లాలనుకున్నారు. కాగా తాజాగా బంగ్లాదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మూడు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ తన బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: