చిత్తూరు జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలున్నా అందరి కళ్ళు మాత్రం తిరుపతిపైనే ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వెలసిన ప్రాంతం కాబట్టే దీనికింత ప్రాధాన్యత. ఇక జిల్లా కేంద్రం చిత్తూరే అయినా మొదటి నుండి రాజకీయంగా మాత్రం తిరుపతే కీలకంగా ఉంది. అందుకనే తిరుపతి ఎంఎల్ఏకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మున్సిపల్ ఛైర్మన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటోంది. ప్రస్తుతం ఈ మున్సిపాలిటిని గెలుచుకోవటం అధికార వైసిపితో పాటు ప్రధాన ప్రతిపక్షం టిడిపికి కూడా చాలా ప్రిస్టేజ్ గా మారింది.

 

మొన్నటి ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డి టిడిపి అభ్యర్ధి సుగుణ పై గెలిచాడు. గెలిచింది కూడా కేవలం కొన్ని వందల ఓట్ల మెజారిటితొనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రమంతా వైసిపి ప్రభంజనం కనిపించినా తిరుపతిలో మాత్రం భూమన వందల ఓట్ల మెజారిటితోనే గెలవటంలో అర్ధమేంటి ? ఏమిటంటే భూమనపై జనాల్లో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం. కారణాలు ఏమైనా కావచ్చు భూమనంటే  జనాల్లో చెప్పలేని అయిష్టత పేరుకుపోయింది.

 

ఈ నేపధ్యంలోనే మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి తరపున పోటి చేసే అభ్యర్ధుల ఎంపిక బాధ్యత పూర్తిగా ఎంఎల్ఏదే అనటంలో సందేహం లేదు. కాబట్టి వాళ్ళ గెలుపోటములకు బాధ్యత వహించాల్సింది కూడా ఎంఎల్ఏనే. అందుకనే మేయర్ అభ్యర్ధితో పాటు కార్పొరేటర్లుగా పోటి చేసే అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నాడు ఎంఎల్ఏ. అదే సమయంలో కొడుకు అభినయ్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా మారింది.

 

ఇక టిడిపిలో మాజీ ఎంఎల్ఏ సుగుణే మేయర్ అభ్యర్ధిగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. నిజానికి సుగుణ మీద కూడా జనాల్లో వ్యతిరేకతుంది. ఎంఎల్ఏని అడ్డం పెట్టుకుని అల్లుళ్ళు పెత్తనం చెలాయించారనే ఆరోపణలున్నాయి. దాంతో జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. అలాంటిది మళ్ళీ ఆమెకే టిక్కెట్టంటే టిడిపి పరిస్ధితేంటో అర్ధమైపోతోంది. మున్సిపాలిటిలో ప్రధానంగా బలిజలు, బ్రాహ్మణులు, యాదవులు, రెడ్లు, ఎస్సీలతో పాటు ముస్లింలు కూడా బాగానే ఉన్నారు. మేయర్ అభ్యర్ధి ఎంపిక తర్వాత  ఓటర్లు ఎవరివైపు మొగ్గుతారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: