మధ్యప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు. ఇవాళ సాయంత్రం ఆయన బీజేపీలో చేరనున్నారు. సింధియా మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలు బెంగుళూరులోని ఓ హోటల్ లో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కమల్ నాధ్ సర్కార్ సంక్షోభంలో పడింది. ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ కు పంపారు. వీరంతా సింధియా కు మద్దతుగా ఉన్నారు.

 

 

సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఏర్పడింది. ఇద్దరు బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చనిపోవడంతో..రెండు సీట్లు ఖాలీగా ఉన్నాయి. వీరుపోను బీఎస్పీ, ఎస్పీ, ఇతర స్వతంత్ర అభ్యర్ధులు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారు. అయితే వీరిని కూడా తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. వీరి రాజీనామాలను ఆమోదించినా లేకపోయినా...అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే...మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కూలడం అనివార్యంగా కనిపిస్తోంది. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే...కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యేలను హెచ్చరించింది కాంగ్రెస్ అధిష్టానం. సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.

 


మరోవైపు బీజేపీ సీనియర్‌ నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు రాజీనామా నేపథ్యంలో సింధియాకు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. సాయంత్రంలోగా దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 7 గంటలకు భోపాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ చెరో స్థానాన్ని దక్కించుకునేందుకు స్పష్టమైన మెజార్టీ ఉంది.. మూడో సీటు కోసం రెండు పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి.

 

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 18ఏండ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. 

 

'కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ చేయలేకపోతున్నా..అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. కాంగ్రెస్‌లో సముచిత స్థానం లభించలేదు. ఏడాదికాలంగా పార్టీని వీడాలనుకుంటున్నా. మొదటి నుంచి రాష్ట్రానికి, దేశానికి సేవచేయాలనేదే నా కోరిక, కానీ  కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నాను. కాంగ్రెస్‌లో తనకు సహకరించిన అందరికీ   కృతజ్ఞతలు.  భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని' సింధియా పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏ మాత్రం ఉపేక్షించకూడదని  కాంగ్రెస్‌ అధిష్టానం హెచ్చరించింది. జ్యోతిరాదిత్యను పార్టీ నుంచి బహిష్కరించినట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందునే బహిష్కరిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: