చంద్రబాబునాయుడుకు వామపక్షాల్లో ఒకటైన సిపిఎం పెద్ద షాకే ఇచ్చింది. వామపక్షాలతో కలిసి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయాలని చంద్రబాబు అనుకున్నారు. దాదాపు పదేళ్ళ తర్వాత చంద్రబాబు మళ్ళీ వామపక్షాలతో జతకట్టబోతున్నారు. అవసరానికి వామపక్షాలను దగ్గరకు తీసుకోవటం, అవసరం తీరిపోగానే దూరంగా నెట్టేయటం చంద్రబాబుకు ఎంత అలవాటో వామపక్షాలకు అంత అనుభవం.

 

అయితే పరస్పరం అవసరం వచ్చింది కాబట్టి వేరే దారిలేక చంద్రబాబు మళ్ళీ వామపక్షాలతో కలిసి పోటి చేయాలని అనుకున్నారు. అనుకున్న వెంటనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణతో మాట్లాడారు. ఎలాగూ రామకృష్ణ మూడు రాజధానుల వివాదంలో చంద్రబాబుతోనే ఎక్కువగా ఉంటున్నారు. తెరవెనుక ఏమి జరిగిందో ఏమో తెలీదు కానీ చంద్రబాబుతో కలిసి పనిచేయటానికి రామకృష్ణ వెంటనే ఒప్పేసుకున్నారు.

 

తన బుట్టలో పడిన సిపిఐ కార్యదర్శినే సిపిఎంతో కూడా ఒప్పించాలని చంద్రబాబు అడిగారు. అయితే చంద్రబాబుతో సిపిఐ అంటకాగినట్లుగా సిపిఎం ఊరేగట్లేదు. మొదటి నుండి కూడా దూరంగానే ఉంటోంది. తాను నేరుగా మాట్లాడితే పొత్తులకు సిపిఎం అంగీకరించదనే చంద్రబాబు సిపిఐను ప్రయోగించారు. అయితే సిపిఐ ప్రయోగం కూడా పారలేదు.  పొత్తులకు సిపిఎంను ఒప్పించేందుకు సిపిఐ ఎంతగా ప్రయత్నించినా చంద్రబాబుతో కలిసి నడవటానికి వాళ్ళు ఒప్పుకోలేదు.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  తాము ఒంటిరిగానే పోటి చేస్తామంటూ సిపిఎం బహిరంగంగానే ప్రకటించేసింది. సిపిఎం చేసిన ప్రకటనతో  చంద్రబాబుకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది.  నిజానికి సిపిఐతో పాటు సిపిఎంకు కూడా జనాల్లో పెద్ద బలమేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. వామపక్షాలకు జనాలు స్పిందించే రోజులు ఎప్పుడో పోయాయి. కాలం చెల్లిన సిద్దాంతాలు, విచిత్రమైన వాదనలతో జనాల ముందు వామపక్షాలు బాగా చులకనైపోయాయి. ఇటువంటి వామపక్షాలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నాడంటే పార్టీ పరిస్ధితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధమైపోతోంది. మళ్ళీ ఇందులో కూడా సిపిఎం పొత్తులు వద్దుపొమ్మనటమే విచిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: