ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 59.85 రిజర్వేషన్ల శాతం రాజ్యాంగ బద్ధమైనది కాదని, వీటిని 50 శాతానికి కుదించాలని హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీని వలన బలహీన వర్గాలు 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోనున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. బీసీల ద్రోహి మీరంటే మీరంటూ ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు.

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 59.85 శాతం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 176ను విడుదల చేసింది. ఇందులో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీ లకు 6.77 శాతం కేటాయించారు. ఏపీలో 59.85 శాతం రేజర్వేషన్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన ప్రతాపరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 176ను తప్పుబట్టింది.

 

ఈ నేపథ్యంలో ప్రతాపరెడ్డి మీ పార్టీకి చెందిన వాడంటే మీ పార్టీకి చెందిన వాడంటూ అధికార ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కావాలనే ప్రతాపరెడ్డితో కోర్టులో పిటిషన్ వేయించడాని, చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబుకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు బీసీల రేజర్వేషన్స్ తగ్గింపుని నిరసిస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర కోర్టులో పిటిషన్ వేశారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 16వేల మందికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా చేస్తున్నాడని, బీసీలకు ద్రోహం చేస్తున్నాడంటూ ఆరోపించారు.

 

ఇదిలా ఉండగా నెల రోజుల సమయంలో స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 21న ఎన్నికల పోలింగ్‌, మార్చి 24న కౌంటింగ్‌ జరగనుంది. మార్చి29న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. 30న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్,కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, 30న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్లు కీలకం కానున్నాయి. బీసీలు ఎవరివైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే దాకా ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: