స్థానిక పోరుకు నగారా మోగడంతో అనంతపురం జిల్లాలో రాజకీయాలు  వేడెక్కాయి. ప్రధానంగా కీలకమైన రెండు పదవులపై నేతలు పోటీపడుతున్నారు. జడ్పీ పీఠంతో పాటు నగర మేయర్ పై ప్రత్యర్థి పార్టీల కంటే స్వపక్షంలోనే పోరు ఉధృతంగా సాగుతోంది. అధికార పార్టీలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాకుండా.. గ్రూపు రాజకీయలు, రహస్య మంతనాలు చేస్తున్నారు. 

 

అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. అధికారంలో ఉన్న వైసీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడం... ప్రతి పక్ష టీడీపీ సత్తా చాటాలనుకోవడంతో పరిస్థితి హాట్ హాట్ గా మారింది.  సర్పంచి, ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీ ఛైర్మన్ వరకు, వార్డు మెంబర్ దగ్గర నుంచి మేయర్ స్థానం వరకు అధికారపార్టీలో అంతటా పోటీ కనిపిస్తోంది. టీడీపీ నేతలు కూడా పోటీ ఇచ్చేందుకు తమకు ఛాన్స్ ఇవ్వమంటూ పార్టీ కీలక నేతల వద్ద చర్చలు జరుపుతున్నారు. అయితే జిల్లాలో రిజర్వేషన్లు అధికార పార్టీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాయి. ప్రధానంగా జడ్పీ ఛైర్మన్ స్థానంపై చాలా మంది రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కాని అది కాస్త బీసీ ఉమెన్ కు కేటాయించడంతో.. వారు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే... జడ్పీ ఛైర్మన్ కంటే.. వైస్ ఛైర్మన్ కే ఎక్కువ పోటీ ఉంది. దీనికి కారణం.. వైస్ ఛైర్మన్ స్థానం జనరల్ కు కేటాయించడమే.


అనంతపురం మేయర్ స్థానం.. వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. కొందరు నేతలు ఎప్పటి నుంచో మేయర్ పదవిపై కన్నేశారు. మేయర్ స్థానానికి నలుగురు బలమైన వ్యక్తులు పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే  గురునాథరెడ్డి కుటుంబసభ్యులు కాగా, మాజీ కార్పొరేటర్లు చవ్వా రాజశేఖర్ రెడ్డి , కోగటం విజయ భాస్కర్ రెడ్డి, గతంలో ఎమ్మెల్యే స్థానం కోసం పోటీ పడిన కాపు సామాజిక వర్గానికి చెందిన మహాలక్ష్మీ శ్రీనివాస్  బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నారు. అప్పుడే రహస్య మంతనాలు, అధిష్టానం నుంచి ఒత్తిళ్లు.. ఇలా సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఇక ప్రతిపక్షమైన టీడీపీలో కూడా కొందరు నేతలు మేయర్ అభ్యర్థిగా నిలిచేందుకు పోటీ పడుతున్నారు. 

 

ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండటంతో.. కీలక అభ్యర్థిత్వాల కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలతో జిల్లాలో వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్ల వద్ద జనం సందడి చూస్తే సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువగా హడావుడి కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: