మధ్యప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం దాదాపు ముగిసిన‌ట్టే అనుకోవాలి. ఇక ఈ వివాదానికి కార‌ణ‌మైన కాంగ్రెస్ నేత‌, జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీతో భేటీ అయిన సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా లేఖ పంపారు. ఇక ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డం లాంఛ‌న‌మే కానుందంటున్నారు. మంగ‌ళ‌వారం సాయ‌త్రం సింధియా ఢిల్లీలో బీజేపీ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది.



ఇక ఎంపీ ముఖ్య‌మంత్రి కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 20 ఎమ్మెల్యేలు తమ రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. రాజీనామా చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటంతో వారందరినీ మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎంకు గవర్నర్‌ టాండన్‌ లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరితే ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంప‌డంతో పాటు కేంద్ర మంత్రి ప‌ద‌వి బీజేపీ ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.



ఇందుకు సింధియా కూడా ఓకే చెప్పార‌ని అంటున్నారు. జ్యోతిరాదిత్య సింధియాను ఈ నెలాఖ‌రులోనే జ‌రిగే రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయ‌డంతో పాటు వెంట‌నే కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను లాక్కుని ప్ర‌భుత్వాన్ని కూల‌దోసిన బీజేపీ ఇప్పుడు ఎంపీలోనూ సింధియా వ‌ర్గానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకుని ఇక్క‌డ కూడా క‌మ‌ల‌నాథ్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు స్కెచ్ గీసింది. ఈ స్కెచ్ దాదాపు స‌క్సెస్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.



ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సీఎం సీటు త‌న‌దే అని రాష్ట్రంలో అన్నీ తానై న‌డిపించిన సింధియాకు సీఎం సీటు దక్కకపోవడంతో అధిష్టానంపై గతకొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో ఇదే సరైన సమయంగా భావించి చాకచక్యంగా పావులుకదిపారు. ఇక ఇప్పుడు బీజేపీ కూడా త‌న ఆట మొద‌లెట్టేసింది. కమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయిందని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభ్యులు గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: