కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలకు నామినేషన్ల కార్యక్రమం జోరు అందుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. అయితే జిల్లాలో వైసీపీ, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లే గెలిచిన, కేడర్ బలం ఉండటం వల్ల, వైసీపీకి పోటీగా నిలుస్తోంది.

 

ముఖ్యంగా విజయవాడ పక్కనే ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీకి, టీడీపీ మంచి ఫైట్ ఇస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ మంత్రి పార్థసారథి వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇక గెలిచిన దగ్గర నుంచి పార్థసారథి బాగానే పనిచేసుకుంటున్నారు. అటు టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన బోడే ప్రసాద్ కూడా నియోజకవర్గంలోనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు బలమైన అభ్యర్ధులనే రంగంలోకి దింపుతున్నారు.

 

కాగా, నియోజకవర్గంలో కంకిపాడు, వుయ్యూరు, పెనమలూరు మండలాలు ఉన్నాయి. అలాగే వుయ్యూరు మున్సిపాలిటీ ఉంది. అయితే ఈ మూడు మండలాల్లో వైసీపీ, టీడీపీలు బలంగానే ఉన్నాయి. అందుకే మూడు చోట్ల హోరాహోరీ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అటు వుయ్యూరు మున్సిపాలిటీలో కూడా రెండు పార్టీలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. కాకపోతే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రభావం ఈ నియోజకవర్గంపై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

 

ఈ నియోజకవర్గం అమరావతికి దగ్గర ఉండటం వల్ల, వైసీపీకి కాస్త అనుకూల ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదు. అదే సమయంలో టీడీపీ కేడర్ ఇక్కడ బాగా కష్టపడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసి మీద ఉన్నారు. అయితే అధికారంలో ఉండటం పార్థసారథికి కలిసొచ్చే అంశం. మరి చూడాలి పెనమలూరులో పార్థసారథి సత్తా చాటుతారో లేక సైకిల్‌తో ఇబ్బంది పడతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: