అవును. నిజమే.. వినడానికి ఆశ్చర్యంగా వున్న ఇది అక్షరాలా నిజం. అక్కడ 5 రూపాయలకే భోజనామృతం వడ్డిస్తున్నారు. హరేరామ - హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘భోజనామృతం’ కార్యక్రమాన్ని, తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుగారు సిద్దిపేటలోని రైతుబజారులో దీనిని  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 రూపాయలకే భోజనం అందివ్వడం అక్కడ విశేషం.

 

అయితే ఇక్కడ మెచ్చుకోదగ్గ ఇంకో విషయం ఏమంటే.. ‘భోజనామృతం’లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం. ఇక్కడ స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు మాత్రమే వాడుతున్నారు, ఇకపైన కూడా అవే వాడనున్నారు. ఈ సందర్భంగా హౌరావనీయులైన మంత్రిగారు రైతులకు స్వయంగా భోజనం వడ్డించడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో ఈయనతో పాటు ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు కరుణేంద్ర, కేతి నర్వరీ, భాస్కర్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన రైతులకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన హరీష్‌ రావు.. "పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా?" అని మహిళా రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఇంకా  వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఏ పంటలు ఏ సమయంలో పండించాలో వారికి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రణాళికా ప్రకారం పంటలు వేసుకోవాలని, తద్వారా అధిక దిగుబడులు వస్తాయని, అలా క్రమేపి రైతు.. రాజు అవుతాడని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. 

 

టమోటా పంట శీతాకాలంలో ఎక్కువ పండుతుంది గనుక ఎక్కువ డిమాండ్‌ ఉంటుందనీ.. అలాగే నిత్యావసరాలను దృష్టిలో ఉంచుకొని, వేసవిలో కూడా టమాట పంటను పండించాలని వారికి చెప్పారు. పంటలకు అవసరమైన షెడ్డుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని మంత్రి.. రైతులకు భరోసా ఇచ్చారు. చివరగా... రైతు బజారును పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని.. అపుడే కాయ గూరలకు మంచి గిరాకీ ఏర్పడుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: