మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌తోపాటు మరో మాజీ ఎమ్మెల్యే రెహమాన్ టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంకెవరు పార్టీని వీడతారో అని ఆలోచిస్తుండగానే మరో ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి, దర్శికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.
 
 
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సీఎం జ‌గ‌న్‌మోహన్ రెడ్డి పై విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల కాలంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి ధ‌న దాహంతోపాటు రాజ‌కీయ దాహం కూడా ఎక్కువైంద‌న్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్సాహించ‌డం వైసీపీ దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని అశోక్ బాబు హెద్దేవా చేశారు.
 
 
అంతేకాకుండా నాడు స‌తీష్‌రెడ్డి త‌న తాత‌ రాజారెడ్డి ని చంపాడ‌ని ఆరోపించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, నేడు స‌తీష్ రెడ్డిని వైసీపీలోకి ఎలా ఆహ్వానిస్తార‌ని ప్ర‌శ్నించారు. అలాగే, వైఎస్ఆర్ మృతికి రిల‌య‌న్స్ వారు బాధ్యుల‌న్న సీఎం జ‌గ‌న్‌, వారు సూచించిన వ్య‌క్తికి రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌డం వెనుక ఆంత‌ర్య‌మేమిట‌ని ప్ర‌శ్నించారు ఎమ్మెల్సీ అశోక్ బాబు.
 
 
మార్చి 21న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా ఎన్నికలకు ముందు నేతలు పార్టీని వీడటం వల్ల టీడీపీ ఆత్మరక్షణ పడిపోతుందని వైసీపీ భావిస్తోంది. ఈ కారణంగానే టీడీపీ నుంచి వైసీపీలోకి ఉన్నట్టుండి చేరికలు మొదలయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మార్చి ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: