జ్యోతిరాధిత్య సింధియా ఈ యువ‌నేత ఇప్పుడు దేశ రాజ‌కీయాల్లో ఓ సంచ‌ల‌నం. కాంగ్రెస్ పార్టీ విధేయుడైన మాధ‌వ్‌రావు సింధియా రాజ‌కీయ వార‌సుడు అయిన ఈ యువ‌నేత కార‌ణంగా కమల్‌నాథ్‌ సారథ్యంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది.  17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బెంగుళూరు రిసార్ట్‌లో మకాం వేసిన సింధియా.. ఈ రోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అనంత‌రం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  రాజీనామా లేఖను కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు.

 

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఈ సాయంత్రం బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. జ్యోతిరాధిత్య హఠాత్​ రాజీనామా, బీజేపీలో చేరడం వంటి అంశాలపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్​ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ఈ ఎపిసోడ్​పై ఘాటుగా స్పందించారు.  జ్యోతిరాదిత్యా సింధియా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపించారు. జాతీయ సంక్షోభ సమయంలో బీజేపీతో చేతులు కలపడం అంటే వ్యక్తి రాజకీయ స్వలాభాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. జ్యోతిరాదిత్య సింధియా వంటివారు అధికారం లేకుండా బ్రతకలేరని, అతడు ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదని గెహ్లాట్​ ఎద్దేవా చేశారు.

 

కాగా, ఈ మొత్తం వ్యవహారాలపై కాంగ్రెస్​ పార్టీకి చెందిన సీనియర్​ నేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్ మాత్రం ఊహించని రీతిలో  స్పందించారు. జ్యోతిరాదిత్యాను బీజేపీ రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావ్‌ సింధియా బ్రతికి ఉన్నైట్లెతే ప్రధానమంత్రి అయ్యేవాడని నట్వర్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  జ్యోతిరాదిత్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరటం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆయన అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: