స్థానిక సంస్థల ఎన్నికల వేళ భారీ స్థాయిలో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది అధికార వైసీపీ. నిన్నమొన్నటిదాకా ఎమ్మెల్యేల వరకే పరిమితమైన ఈ ఆపరేషన్‌... ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు... ద్వితీయ శ్రేణి నేతల దాకా వెళ్లింది. అదనుచూసి వైసీపీ కొట్టిన ఈ దెబ్బకు... టీడీపీ షాక్‌లో ఉంది.

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కోలాహలం నెలకొన్న సమయంలో... రాజకీయంగా ఒక్కసారిగా కలకలం రేగింది. టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీలోకి క్యూకట్టబోతున్నాన్న వార్తలతో... ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. ఎవరెవరు పార్టీని వీడుతున్నారు? వారిలో ఎంతమంది వైసీపీలో చేరుతున్నారు? అని ఆరా తీస్తున్నారు. 

 

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పి... జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. MLCగా రాజీనామా చేసిన సమయంలోనే వైసీపీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తల్ని ఖండించిన ఆయన... వైసీపీలో చేరాక... తాను 2014, 2015 సమయంలోనే జగన్‌ పార్టీలో చేరాలని అనుకున్నానని... అయితే రాయపాటి సాంబశివరావుతో కలిసి టీడీపీలో చేరాల్సి వచ్చిందని చెప్పారు. జగన్‌ ప్రభుత్వ విధానాలు నచ్చడం వల్లే తాను వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు. డొక్కా వైసీపీలో చేరిన రోజే... విశాఖ మాజీ ఎమ్మెల్యే SA రెహమాన్‌ కూడా జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. 

 

డొక్కా, రెహమాన్‌ వైసీపీలో చేరిన మర్నాడే... కడప జిల్లాలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఆయన వైసీపీలో చేరేది ఇంకా ధృవీకరించకపోయినా... జగన్‌ పార్టీలో చేరడం ఖాయమనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. వేంపల్లెలోని తన ఇంట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో... టీడీపీని వీడుతున్నట్లు సతీష్‌ రెడ్డి ప్రకటించారు. దశాబ్దాలుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా... పార్టీలో సరైన ఆదరణ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చంద్రబాబుకు నమ్మకం సన్నగిల్లిందని... నమ్మకం లేని చోట తాను ఉండలేనని చెప్పారు. కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.

 

అయితే సతీష్‌ రెడ్డి వైసీపీలో చేరడం లాంఛనమే అని... ఆయన 13న తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైందని సన్నిహితులు చెబుతున్నారు. సతీష్‌ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. రెండుసార్లు వైఎస్‌పై, రెండుసార్లు జగన్‌పై టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సతీష్‌రెడ్డి పార్టీలో చేరితే... పులివెందులలో ఇక తమకు ఎదురే ఉండదని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

 

కడప జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలోనూ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014లో  కనిగిరి ఎమ్మెల్యేగా గెలిచిన బాబూరావుకు 2019లో అక్కడి టికెట్ లభించలేదు. పార్టీ అధిష్టానం మేరకు దర్శి నుంచి పోటీచేసి... ఓడిపోయారు. అప్పటి నుంచి బాబూరావు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు సన్నిహితుడైన బాబూరావు... ఆయన ద్వారానే టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడాయన పార్టీని వీడటం... ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: