ఇటీవ‌ల శాస‌న‌స‌భ‌లో పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఒక ద‌శ‌లో స‌హ‌నం కోల్పోయిన ఇరువురూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్లు విసురుకోవ‌డం తెలిసిందే.. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ మంత్రి ద‌యాక‌ర్‌రావు.. ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే రాజ‌గోపాల్ రెడ్డి కూడా అంతేస్థాయిలో మంత్రికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ ద్రోహుల‌ను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ప‌రిస్థితి ఇలానే ఉంట‌ద‌ని మంత్రి ఎర్రబెల్లిని ఉద్దేశించి రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఇరువురి మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే జ‌రిగింది.

 

కాగా ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. స‌భ‌లో ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి తీరుపై తీవ్ర అభ్యంత‌రం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే స‌మావేశం అనంత‌రం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును పిలిపించుకుని, ఆయ‌న్ను కూడా గ‌ట్టిగానే మంద‌లించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచా రం. ఇక ముందు అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కూడ‌ద‌ని సద‌రు మంత్రికి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. అంతేగాక ఇక ముందు ప్ర‌భుత్వంపై ప్ర‌తిప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌లకు ఒక‌రిద్ద‌రు మంత్రులు మాత్ర‌మే కౌంట‌ర్ ఇవ్వాల‌ని తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్న మంత్రులు మాత్ర‌మే ప్ర‌తిపక్షాల ఆరోప‌ణ‌ల‌కు జ‌వాబు చెప్పాల‌ని సీఎం కేసీఆర్ ఇత‌ర మంత్రుల‌కు హుకుం జారీ చేశార‌నే వార్త  కేబినెట్‌లో గుప్పుమంటోంది.

 

అయితే ప్ర‌స్తుత కేబినెట్‌లో ఉప ముఖ్య‌మంత్రులు మ‌హ‌మూద్ అలీ, కొప్పుల ఈశ్వ‌ర్‌తో పాటు ఈట‌ల రాజేంద‌ర్‌, హ‌రీష్‌రావు, కేటీఆర్‌, అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, గుంత‌కంట్ల జ‌గ‌దీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, ఎర్రబెల్లి ద‌యాక‌ర్రావు,  వీ శ్రీనివాస్‌గౌడ్‌, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, చామ‌కూర మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి,  గంగుల క‌మ‌లాక‌ర్‌, పువ్వాడ అజ‌య్‌కుమార్‌తోపాటు స‌త్య‌వ‌తి రాథోడ్ మంత్రులుగా ఉన్నారు. వీరిలో మ‌హ‌మూద్ అలీ, కొప్పుల ఈశ్వ‌ర్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, హ‌రీశ్‌రావు, కేటీఆర్‌, నిరంజ‌న్‌రెడ్డితోపాటు శ్రీనివాస్‌గౌడ్ మాత్ర‌మే తెలంగాణ ఉద్యమంలో చ‌రుగ్గా ప‌నిచేశారు. అయితే ఒక‌వేళ ముఖ్యమంత్రి ఆదేశాల‌ను పాటించాల్సి వ‌స్తే.. వీరు మిన‌హా మిగిలిన మంత్రులంతా దాదాపు సైలెంట్ అవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డ‌నుంది.  తెలంగాణ ఉద్య‌మానికి దూరంగా ఉన్న ఆయా మంత్రులంతా ముఖ్యమంత్రి సూచ‌న‌ల‌కు అనుగుణంగా భ‌విష్య‌త్‌లో గుప్ చుప్‌గా ఉంటారో.. లేదో వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: