వైసిపి తరపున రాజ్యసభకు ఎంపికవ్వబోతున్న పరిమళ్ ధీరజ్ నత్వానికి జగన్మోహన్ రెడ్డి ఓ టార్గెట్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఆ టార్గెట్ ఏమిటంటే శాసనమండలి రద్దుకు కేంద్రప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్  తెప్పించే బాధ్యత నత్వానీ మీద ఉంచాడట. ఇప్పటికే మండలి రద్దుకు కేంద్రప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది.  శాసనమండలిని రద్దు చేస్తు  అసెంబ్లీ  పంపిన  తీర్మానాన్ని కేంద్రం తొందరగా ఆమోదించేట్లు జగన్ ఇప్పటికే గట్టిగా ఫాలో అప్ చేస్తున్నాడు.

 

రాజ్యసభలో వైసిపికి ఉన్న ఆరుగురు రాజ్యసభ ఎంపిల బలం నరేంద్రమోడికి చాలా అవసరం. ఆ అవసరం దృష్ట్యానే మొన్న ఢిల్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన రోజే జగన్ ను మోడి ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ దాదాపు రెండుగంటల పాటు మాట్లాడారు. అప్పటికి నాలుగు నెలలుగా కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వని మోడి ఇంత హఠాత్తుగా అపాయిట్మెంట్ ఇవ్వటం వెనుక అవసరమే అసలు కారణం.

 

అదే పద్దతిలో అపాయిట్మెంట్ ఇచ్చిన తర్వాత కలవటానికి ఇష్టపడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా జగన్ ను పిలిచి మరీ భేటి అయ్యాడు. సరే ఈ భేటిలోనే వాళ్ళకు కావాల్సింది అంటే నత్వానికి వైసిపి తరపున రాజ్యసభ అవకాశం అడిగారు. అదే సమయంలో తనకు కావాల్సిన శాసనమండలి రద్దు తదితరాలను జగన్ వాళ్ళ ముందుంచినట్లు సమాచారం. ఉభయుల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు అయిన తర్వాతే మండలి రద్దు ప్రక్రియ స్పీడందుకున్నదట.

 

ఈ నేపధ్యంలోనే నత్వానీకి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చిన తర్వాత రెండు అంశాలను ప్రధానంగా చెప్పారట.  మోడి, అమిత్ షా తో  మాట్లాడి  శాసనమండలి రద్దు చేయించటం మొదటి అంశమైతే రిలయన్స్ ద్వారా  ఏపికి భారీ పెట్టుబడులు పెట్టించటం రెండో అంశమట. నిజానికి రెండు కూడా నత్వానికి పెద్ద విషయాలు కావు. ఎందుకంటే మోడి, అమిత్ షా కు నత్వాని అత్యంత సన్నిహితుడు. వీళ్ళకన్నా ముఖేష్ అంబానికి ఇంకా సన్నిహితుడు. కాబట్టి నత్వాని కాస్త ప్రయత్నిస్తే చాలు పై రెండు విషయాలు అయిపోతాయనటంలో సందేహం లేదు. చూద్దాం మరి నత్వాని ఎంత వరకూ నెగ్గుకొస్తాడో ?

మరింత సమాచారం తెలుసుకోండి: