నిజంగానే పార్టీ నేతలకు వేంపల్లి సతీష్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఓ డేంజర్ సిగ్నల్ లాగే ఉన్నట్లుంది.  చంద్రబాబునాయుడు వ్యవహార శైలి నచ్చని వాళ్ళు, నాయకత్వం మీద నమ్మకం లేని వాళ్ళంతా టిడిపిని వదిలేయటానికి రెడీ అయిపోతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తునిగా ఉన్న సతీషే చివరకు పార్టీని వదిలేశాడంటే ఏమిటర్ధం ?  కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలంటే అందరికీ ముందుగా సతీష్ రెడ్డే గుర్తుకొచ్చేవాడు.

 

అలాంటి సతీషే చివరకు మంగళవారం పార్టికి రాజీనామా చేయటం అందులోను చంద్రబాబు వ్యవహారశైలితో విసిగిపోయే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పటం పార్టీలో సంచలనంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పైన రెండుసార్లు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెండుసార్లు పోటి చేసిన సతీష్ నాలుగు సార్లూ ఓడిపోయాడు. వైఎస్ కుటుంబం మీద పోటి చేస్తే గెలుస్తారని ఎవ్వరూ అనుకోరు. కానీ పోటి అయితే చేయాలి కదా ? అలా పోటి  చేయటానికి కూడా జిల్లా మొత్తం మీద నేతలెవరూ ముందుకు రాని పరిస్ధితుల్లో సతీష్ ను చంద్రబాబు ఏకంగా నాలుగుసార్లు రంగంలోకి దింపాడు.

 

అలాంటిది పార్టీ అధికారంలో ఉన్నపుడు ఓసారి ఎంఎల్సీగా అవకాశం ఇచ్చాడంతే. అప్పుడే శాసనమండలి డిప్యుటి ఛైర్మన్ గా చేశాడు. టర్మ్ అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయమంటే చంద్రబాబు పట్టించుకోలేదట. నిజానికి వైఎస్సార్ కుటుంబంపై పోటి చేయటానికి ధైర్యంగా ముందుకొచ్చిన సతీష్ ను అన్నీ విధాల బలోపేతం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది. కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ పని చేయలేదట.  ఇక భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కూడా లేకపోవటంతో చివరకు పార్టీకి రాజీనామా చేసేశాడు.

 

సతీష్ రాజీనామాతో చాలామంది నేతల్లో చంద్రబాబు వ్యవహారశైలిపై చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో మాజీ ఎంఎల్ఏ కదిరి బాబురావు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయాడు. రేపో మాపో మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా రాజీనామా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే విశాఖలో మాజీ ఎంఎల్ఏ రెహ్మాన్ వైసిపిలో చేరాడు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా రాజీనామా చేశాడు.  ఇలా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరేందుకు చాలామందే రెడీ అవుతున్నారట. స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత సీనియర్లందరూ పార్టీకి రాజీనామాలు చేయటం చంద్రబాబుకు పెద్ద దెబ్బే.

మరింత సమాచారం తెలుసుకోండి: