మధ్యప్రదేశ్ సంక్షోభం.. రాజస్థాన్‌లోనూ తలెత్తబోతోందా...? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విభేదాలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకోబోతుందా ? మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత రాజస్థాన్‌పై బీజేపీ ఫోకస్ పెట్టబోతోంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌ల మధ్య పెరుగుతున్న దూరం..కాంగ్రెస్‌ను కలవరపెడుతుంది. మధ్యప్రదేశ్ గుణపాఠంతో కాంగ్రెస్ మేలుకోకపోతే...రాజస్థాన్‌ కూడా చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఆపరేషన్ కమల కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సంక్షోభాన్ని సరైన సమయంలో పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తాత్సారం చివరకు ఆ పార్టీ మూల్యం చెల్లుంచుకునే వరకు వస్తోంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ వర్సెస్ జ్యోతిరాదిత్య సింధియా తరహా రాజకీయాలే రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. బోటాబోటీ మెజార్టీతో ఇతరుల మద్దతుతో  కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తోంది. మధ్యప్రదేశ్ తరహాలోనే 20 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు మారితే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం.

 

మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పోషించిన పాత్రనే రాజస్థాన్‌లో సచిన్ పైలెట్ పోషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో సచిన్ పైలెట్ కీలకంగా వ్యవహరించారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని ఆశించినా... కాంగ్రెస్ అధిష్టానం...అశోక్ గెహ్లాట్‌ను సీఎంను చేసి.. పైలెట్‌కు డిప్యూటీతో సరిపెట్టింది. అప్పటి నుంచి సచిన్ పైలెట్ అసంతృప్తితోనే ఉన్నారు. పైగా ముఖ్యమంత్రి హోదాలో  అశోక్ గెహ్లాట్  తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు సచిన్ పైలైట్. 

 

ఇటీవల వజ్రాల వ్యాపారి రాజీవ్ అరోరాను రాజ్యసభకు నామినేట్ చేయడంపై సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నేతలను పక్కన పెట్టి వ్యాపారులను రాజ్యసభకు పంపితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని గెహ్లాట్‌కు తన అసంతృప్తిని తెలిపారు. కోటా ఆస్పత్రిలో ఇటీవల సంభవించిన చిన్నారుల మరణాలు కూడా రాజస్థాన్ ప్రభుత్వంలో లుకలుకలను బయటపెట్టాయి. చిన్నారుల మరణాల విషయంలో గెహ్లాట్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని సచిన్ పైలెట్ ఆగ్రహంతో ఉన్నారు.  పేరుకు డిప్యూటీ సీఎంగా ఉన్నా... అశోక్ గెహ్లాట్ తీసుకుంటున్న నిర్ణయాలు సచిన్ పైలెట్‌కు రుచించడం లేదు.

 

ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్షను మొదలు పెడితే...మధ్యప్రదేశ్ తరహా సంక్షోభమే తలెత్తుతుందని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెసె్ నేతలు చెబుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉంటే... ప్రభుత్వానికి 112 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. వీరిలో ముగ్గురు సీపీఎం, ఒకరు ఆర్‌ఎల్డీ సభ్యులు కూడా ఉన్నారు. బీజేపీకి రాజస్థాన్‌ అసెంబ్లీలో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం 20 మంది ఎమ్మెల్యేలు అటుఇటుగా మారితే... గెహ్లాట్ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. మధ్యప్రదేశ్ పరిణామాలతో  ఖంగుతిన్న సోనియా గాంధీ... ఇప్పటికే అశోక్ గెహ్లాట్‌ను ఢిల్లీ పిలిపించినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: