స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో వెలువడడంతో రాజకీయ పార్టీల ఆఫీసుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. టికెట్ల కోసం ఆశావహులు ఎవరికి వారు లాబీయింగ్ చేస్తూ... తమకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నారు. ప్రస్తుతం జెడ్పిటిసి, ఎంపీటీసీ నామినేషన్ల సేకరణ మొదలు కావడంతో, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బలమైన అభ్యర్థుల వేటలో పడ్డాయి. మరోవైపు నామినేషన్ల స్వీకరణతో ఎంపీడీవో, జెడ్పి  కార్యాలయల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఏపీలో 660 జెడ్పిటిసి, 9984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. జెడ్పిటిసి స్థానాలకు జెడ్పీ కార్యాలయాల్లో, ఎంపిటిసి స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లను సేకరిస్తున్నారు. 

 

ఈ నెల 11 వరకు నామినేషన్లన స్వీకరిస్తారు. ఈ నెల 12న ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లను పరిశీలిస్తారు. 13న నామినేషన్లపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 14 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్, 24న కౌంటింగ్ జరగబోతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని స్థానాలను తామే దక్కించుకోవాలనే ఆలోచనతో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు. అలాగే పట్టణ నగరపాలక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలైంది. 103 మున్సిపాలిటీలకు, 13 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 


ఒకే విడతలో ఈ నెల 23న ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 11 నుంచి 13 వరకు నామినేషన్ లను స్వీకరిస్తారు. ఈనెల 23 న పోలింగ్ నిర్వహించి 27న లెక్కిస్తారు. మేయర్, డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎక్కడికక్కడ ఈనెల 31న నిర్వహిస్తారు. రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. తొలివిడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 17 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. రెండో విడతలో జరిగే వాటికి 19 నుంచి 21వ తేదీ మధ్య నామినేషన్లను సేకరిస్తారు. 13 ,377 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. తొలిదశలో రెండో దశలో ఏ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై పూర్తి అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్నికల సందడి బాగా ఎక్కువగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: