ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే దాదాపు 3,500 మంది ప్రాణాలను కోల్పోగా, లక్ష మందికిపైగా ఈ అంటువ్యాధి బారినపడ్డారు. భారత్‌లోనూ కేసులు పెరుగుతుండటం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఈ ప్రభావం అన్ని ప్రాంతాల‌పై, రంగాలపై కనిపించింది. కర్ణాటక, మహారాష్ట్రలో 3 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా బాధితుల సంఖ్య 14కి చేరింది.  తాజాగా కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కరోనా ప్రభావిత ప్రాంతాలు, దేశాల నుంచి భారత్‌కు తిరిగివచ్చినవారు వారి ప్రయాణ సమాచారాన్ని తెలియజేయాలన్నారు. ట్రావెల్‌ హిస్టరీని దాస్తే నేరంగా పరిగణించి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

 


కేరళలో తాజాగా మరో ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 14కు చేరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేరళ సర్కారు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. దీంతోపాటుగా కేరళలోని ప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంపైనా కరోనా ప్రభావం పడింది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తులు అయ్యప్ప దర్శనానికి రావొద్దని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) సూచించింది. నెలవారీ పూజల నిమిత్తం శుక్రవారం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 18న మళ్లీ మూసివేస్తారు. టీబీడీ అధ్యక్షుడు వాసు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో శబరిమల దర్శనానికి రావొద్దని భక్తులకు సూచించారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

 

 

ఇదిలాఉండ‌గా, దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 61కి పెరిగింది. కర్ణాటక, పుణేలో ముగ్గురికి చొప్పున వైరస్‌ సోకినట్లు తేలింది. బెంగళూరులో ప్రాథమిక పాఠశాలలకు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఇద్దరు కరోనా బాధితులకు చికిత్స కోసం దేశంలో తొలిసారి రెండు యాంటీ హెచ్‌ఐవీ మందులను వినియోగించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈశాన్య రాష్ర్టాలు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నాయి. మిజోరం సోమవారమే మయన్మార్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులను మూసివేసింది. విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించింది. తాజాగా మణిపూర్‌ కూడా మయన్మార్‌తో సరిహద్దులను మూసివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: