కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం...రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి పంపడం... పార్టీ ఆమోదించ‌డం తెలిసిన సంగ‌తే. పార్టీలో 18 ఏళ్ల‌ ప్రస్థానానికి ముగింపు పలికి కీల‌క నిర్ణ‌యం తీసుకోవడం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు తెర‌లేపింది. అయితే,  ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్ యువ‌నేత రాహుల్‌గాంధీ బ‌ద్‌నాం అవుతున్నారు. ఆయ‌న వ‌ల్లే జ్యోతిరాధిత్య పార్టీని వీడార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ విశ్లేష‌ణ వివ‌రాలివి.

 


రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా  జ్యోతిరాదిత్య సింధియా గుర్తింపు పొందారు. తండ్రి మాధవరావు సింధియా మరణించటంతో 2002లో జ్యోతిరాదిత్య‌ రాజకీయాల్లోకి వచ్చారు. గుణ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు నాలుగుసార్లు ఎన్నికయ్యారు. అయితే, 2017లో రాహుల్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత.. యువనేతలకు ప్రాధాన్యం కల్పించటంతో జ్యోతిరాదిత్య పేరు ప్రముఖంగా వెలుగులోకి వ‌చ్చింది. కీల‌క‌మైన‌ 2018 మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో జ్యోతిరాదిత్య కీలకపాత్ర పోషించారు. అయితే, ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఎదురైంది. జ్యోతిరాదిత్య సీఎం పదవిపై ఆశ పెట్టుకున్న‌ప్ప‌టికీ ఆ చాన్స్  లభించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ...అదీ దక్కలేదు.

 

మ‌రోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు మారిపోయాయి. పార్టీ అధ్యక్షపదవికి రాహుల్‌ రాజీనామా చేయటంతో పార్టీలో యువనేతలకు ప్రాధాన్యం పోయింది. దీనికంటే మ‌రో ఇబ్బందిని జ్యోతిరాదిత్య ఎదుర్కున్నారు.  గత కొన్ని నెలలుగా ప్రయత్నించినప్పటికీ రాహుల్‌ అపాయింట్‌మెంట్‌ దొరక‌లేదు. ఓ వైపు తాను ఆశించిన రాజ్యసభ సీటుపై పార్టీ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ పీసీసీ సీటుపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో జ్యోతిరాదిత్యకు అసంతృప్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడినట్లు, కాంగ్రెస్‌తో 18 ఏళ్ల‌ ప్రస్థానానికి శుభం కార్డు వేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, చివ‌రి నిమిషంలో కాంగ్రెస్ సింధియాను ఆపేందుకు ప్ర‌యత్నించింది. రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ నేతృత్వంలోని బృందాన్ని ఆయన వద్దకు పంపింది. అయితే వారిని కలిసేందుకు సింధియా ఒప్పుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: