రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనుండటంతో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతలు దాడులు జరుపుకుంటున్నారు. నామినేషన్లు వేసేందుకు వెళ్లిన అభ్యర్థులపై చాలా ప్రాంతాలలో ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వైయస్సార్ కడప జిల్లాలో ఎంపీటీసీ అభ్యర్థి వరప్రసాద్ పై ప్రత్యర్థులు నిన్న రాత్రి కత్తులు, కర్రలతో దాడులకు దిగారు. నిన్న రాత్రి ఒక పని మీద తిప్పారెడ్డిపల్లె వెళుతున్న సమయంలో వరప్రసాద్ పై ఈ దాడి జరిగింది. 
 
ప్రత్యర్థులు కత్తులతో నరకగా వర ప్రసాద్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితుడికి చికిత్స జరుగుతోంది. వరప్రసాద్ పరిస్థితి కొంత విషమంగానే ఉందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎన్నికల వేళ కడప జిల్లాలో హింస చెలరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవైపు గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై ప్రత్యర్థులు దాడికి దిగారు. 
 
మాచవరం మండలం పిన్నెల్లిలో వైసీపీ శ్రేణులు నామినేషన్ వేయడానికి వెళుతున్న టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి చేశాయి. కుర్చీలతో ఇరు పార్టీల నేతలు కొట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను ఘటన స్థలం నుండి పంపించివేయడంతో వివాదం సద్దుమణిగింది. చిత్తూరు జిల్లాలో కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బీజేపీ నేతను వైసీపీ నేతలు అడ్డుకున్నారని సమాచారం. 
 
బీజేపీ నేత హరిబాబు ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లగా కొందరు అతనిని అడ్డుకున్నారు. హరిబాబు వైసీపీ నేతలే తనను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు తమపై రాళ్లతో దాడి చేశారని చెబుతున్నారు. స్థానిక బీజేపీ నేతలు వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం.        

మరింత సమాచారం తెలుసుకోండి: