మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విశాఖ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీకి నేతల రాజీనామాలతో వరుస షాకులు తగులుతున్నాయి. రమేష్ బాబు త్వరలోనే అభిమానులు, కార్యకర్తలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. 
 
వైసీపీలో రమేష్ బాబు చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రేపు ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014లో యలమంచిలి నియోజవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 
 
చంద్రబాబు 2019 ఎన్నికల్లో యలమంచిలి టికెట్ రమేష్ బాబుకు ఇవ్వగా వైసీపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓడిపోయారు. విశాఖ రూరల్ లో టీడీపీ ఒక స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఎన్నికల తరువాత టీడీపీ కార్యక్రమాలకు రమేష్ బాబు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమేష్ బాబు తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. 
 
రమేష్ బాబుతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా పార్టీని వీడారు. ఇటీవల చంద్రబాబు విశాఖలో పర్యటించిన సమయంలో కూడా రమేష్ బాబు పాల్గొనలేదు. వైసీపీ సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులుతో గత కొద్ది నెలల నుండి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే విశాఖ జిల్లా టీడీపీ, జనసేన నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే కడప జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు రామసుబ్బారెడ్డి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వైసీపీలో చేరనున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: