స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఒకవైపు వేడి పెరిగిపోతుంటే మరోవైపు చంద్రబాబునాయుడులో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. బుధవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వంపై రెచ్చిపోయారు. నామినేషన్లు వేయటానికి రెడీ అవుతున్న తమ పార్టీ నేతలపై వైసిపి నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు ఏ స్ధాయిలో ఆగ్రహంతో  ఊగిపోయారంటే జగన్ పై పోలీసులపై ఆరోపణలు, విమర్శలు చేయటానికి చివరకు మాటలు కూడా తడబడ్డాయి.

 

జగన్, పోలీసు వ్యవస్ధలతో పాటు పార్టీ పరిస్ధితిపై చంద్రబాబులో ఒకేసారి కోపం, బాధ, తపన బయటపడ్డాయి. దాడులకు గురైన పార్టీ కార్యకర్తలను పరామర్శకు వెళ్ళిన నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలతో ఫోన్లోనే చంద్రబాబు మీడియా ముందు మాట్లాడించటం గమనార్హం. వాళ్ళు కూడా తాము ప్రాణాలకు తెగించే పోరాటం చేస్తున్నట్లు పదే పదే చెప్పారు. సరే ఇవన్నీ చంద్రబాబు ముందు జాగ్రత్తగానే, ప్లాన్డ్ గా చేయిస్తారనటంలో సందేహం లేదు.

 

క్షేత్రస్ధాయిలో ఎక్కడైనా వైసిపి వాళ్ళు టిడిపి వాళ్ళపై దాడులు చేసుంటే చేసుండచ్చు. అయితే జరిగిన దానికి మించి చంద్రబాబు పచ్చపత్రికల సహకారంతో బూతద్దంలో చూపిస్తారనటంలో కూడా సందేహం లేదు. సరే ఎన్నికలన్నాక ఇదంతా మామూలే అని అనుకోవాల్సిందే. అయితే  ఇటువంటి ధౌర్జన్యాలు, అన్యాయలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

చరిత్రను ఒకసారి చూస్తే వాస్తవాలేంటో తెలుస్తుంది. చంద్రబాబు హయాంలో నంద్యాల ఉపఎన్నిక జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి జనాభిప్రాయం ప్రకారమైతే అప్పుడు వైసిపి గెలవాలి. కానీ గెలిచింది టిడిపి అభ్యర్ధి. ఎలా గెలిచాడు ? అప్పట్లో నంద్యాలలో చంద్రబాబు చేయని అరాచకం లేదు. దారుణాలు లేవు. వైసిపి ఓట్లను తీయించేశాడు. వైసిపి నేతలపై ముందుగానే బైండోవర్ కేసులు పెట్టించి పోలీసులతో అరెస్టులు చేయించాడు.

 

అంతెందుకు వైసిపి అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఇంటిపైనే అర్ధరాత్రి పోలీసులతో దాడులు చేయించాడు. కుటుంబ సభ్యలను ప్రచారానికి పోనీయకుండా హౌస్ అరెస్టులు చేయించాడు. టిడిపి నేతల డబ్బు పంపిణికి పోలీసులే సహకరించారు. పోలీసులు, టిడిపి నేతల ధౌర్జన్యాలపై వైసిపి నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. బహుశా అవన్నీ చంద్రబాబు మరచిపోయినట్లున్నాడు. ఏం చేస్తాం మనం ఏది చేస్తే మనకు అదే జరుగుతుందన్న సూత్రాన్ని మరచిపోయి ఇపుడు యాగీ చేస్తే ఉపయోగమేంటి ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: